వివాదాల రారాజు మిస్టర్ జీనియస్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మంగళవారం లక్ష్మీస్ ఎన్టీఆర్ గురించిన వార్తలు మీడియాలో, సోషల్ మీడియాలో భీభత్సంగా హల్చల్ చేశాయి. రామ్ గోపాల్ వర్మ ఏపీలోని పలమనేరులో అడుగుపెట్టడం.. లక్ష్మీస్ ఎన్టీఆర్ నిర్మాత రాకేష్ రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో పాల్గొనడం.. అక్కడ లక్ష్మీస్ ఎన్టీఆర్ గురించిన కొన్ని వివరాలను మీడియాకి అందించడం వంటి విషయాలతో హోరెత్తిపోయింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సెట్స్ మీదకి తీసుకెళ్లి అక్టోబర్ లో విడుదల చేస్తానని ప్రకటించాడు వర్మ. ప్రస్తుతం నేను ఏ పార్టీకి మద్దతివ్వడం లేదని చెబుతూనే వైసిపి ఎమ్యెల్యేలతో స్నేహం మొదలు పెట్టాడు వర్మ
అయితే ఎన్టీఆర్ జీవితం మహాభారతం వంటిదని.. అందులోని ఒక పార్ట్ ని మాత్రమే తాను తెరకెక్కిస్తున్నానని.. లక్ష్మి పార్వతి, ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించింది మొదలు, ఆయన అమరణించేవరకు జరిగిన సంఘటనలతోనే సినిమాని తెరకెక్కిస్తానని స్పష్టం చేసాడు. ఇక నిర్మాత రాకేష్ రెడ్డి కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం రాజకీయాలతో సంబంధం ఉండదని.. ఎన్ని కోట్లయినా ఖర్చు పెట్టి సినిమా తీస్తామని చెబుతున్నాడు. కాగా ఈ చిత్రానికి సంబందించిన నటీనటుల ఎంపిక ఇంకా జరగలేదని చెప్పిన వర్మ వైసిపి ఎమ్మెల్యే, సినీ నటి రోజా కు ఈ చిత్రంలో ఒక పాత్ర ఉందనే ఆసక్తికరమైన విషయాన్ని చెప్పాడు. మరి రోజా పేరు చెప్పగానే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో రోజా పాత్ర మీద జనాల్లో క్యూరియాసిటీ మొదలైపోయింది.
అయితే ఎమ్యెల్యే రోజా మాత్రం వర్మ గారి లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకి, వైసిపికి ఎటువంటి సంబంధం లేదని చెబుతూనే.. వర్మగారు ఆ సినిమాలో తనకి మంచి రోల్ ఇస్తే తప్పక చేస్తానని చెబుతుంది. అయితే వర్మగారు తనకెలాంటి పాత్ర ఇస్తారో తనకు తెలియదని.. వర్మని కలిసి ఆయనతో సంప్రదించాక అన్ని వివరాలూ వెల్లడిస్తానని చెప్పారు రోజా. ఇకపోతే ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న రోజా ఈ మధ్య ఎటువంటి సినిమాలకు కమిట్ అవ్వలేదు. ఇటువంటి సమయంలో వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆఫర్‌పై రోజా సానుకూలంగా స్పందించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.