మైనర్ భార్యతో శృంగారం అంటే అది అత్యాచారం లాంటిదేనని సుప్రీంకోర్టు బుధవారం సంచలన తీర్పు ఇచ్చింది . ఇలాంటి కేసుల్లో 15 నుంచి 18ఏళ్ల లోపు వివాహిత బాలికలను మినహాయించడం రాజ్యంగబద్ధం కాదని స్పష్టం చేసింది. ఐపీసీ చట్టాల ప్రకారం.. ఓ వ్యక్తి 18ఏళ్ల కంటే తక్కువ వయసున్న బాలికతో లైంగిక చర్యలో పాల్గొనడం నేరం. ఇందులో బాలిక ఇష్టం ఉన్నా లేకపోయినా దీన్ని నేరంగానే పరిగణిస్తారు. అయితే సదరు బాలిక అతడి భార్య అయి ఉండి.. ఆమె వయసు 15ఏళ్లు మించితే ఈ చట్టం నుంచి మినహాయింపు కల్పించారు.
అయితే ఈ మినహాయింపును వ్యతిరేకిస్తూ ఓ ఎన్జీవో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వివాహితులైన మైనర్లతో లైంగిక చర్య ఎంతమాత్రం సరైనదని కాదని పిటిషన్‌లో పేర్కొంది. బాల్యవివాహమే చట్టవ్యతిరేకం అయినప్పుడు 15ఏళ్ల నుంచి 18ఏళ్ల బాలికలపై కాపురం పేరుతో లైంగికచర్యకు పాల్పడటం చట్టమెలా అవుతుందని ప్రశ్నించింది. దీనిపై విచారించిన న్యాయస్థానం.. నేడు తీర్పు వెల్లడించింది. 15 ఏళ్ల నుంచి 18ఏళ్ల మధ్య వివాహిత బాలికలపై లైంగికచర్యను చట్టప్రకారం నేరం నుంచి మినహాయించడం రాజ్యాంగ విరుద్ధమని న్యాయస్థానం స్పష్టం చేసింది. మైనర్లతో శృంగారం అంటే అది అత్యాచారం లాంటిదేనని.. దాన్ని నేరంగానే పరిగణించాలని తెలిపింది.