తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అభ్యర్థులకు ప్రభుత్వం దీపావళి కానుక ప్రకటించింది. ప్రభుత్వ, జిల్లాపరిషత్తు, మండలపరిషత్తు పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 8,792 టీచర్ పోస్టులను భర్తీ చేయడానికి తుది ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టీఆర్టీ) మార్గదర్శకాలను మంగళవారం విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య విడుదల చేశారు.
ఈ మార్గదర్శకాలను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు పంపించారు. పదిరోజుల్లోగా నోటిఫికేషన్ ఇచ్చేందుకు టీఎస్‌పీఎస్సీ అన్ని ఏర్పాట్లు చేసుకొంటున్నది. కొత్తగా ఏర్పాటుచేసిన 31జిల్లాల ప్రకారమే టీచర్ పోస్టులను భర్తీచేయడానికి ఇప్పటికే న్యాయశాఖ ఆమోదం తెలిపింది. సీఎం కేసీఆర్ కూడా ఆమోదం తెలిపిన నేపథ్యంలో మంగళవారం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి 31జిల్లాల ప్రకారం టీచర్ నియామకాలను చేపట్టడానికి సంబంధించిన ఫైల్‌పై సంతకం చేశారు.
ఆ వెంటనే నియామక నిబంధనలతో జీవో 25ను విడుదల చేశారు. 31 జిల్లాలవారీగా ఉన్న టీచర్ పోస్టుల ఖాళీలు, రోస్టర్ పాయింట్ల వివరాల సేకరణలో ఇప్పటికే సర్వీస్ కమిషన్ అధికారులు నిమగ్నమయ్యారని విద్యాశాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.