ఆర్మీలో పనిచేస్తున్న తన భర్త నిండునూరేళ్లు బతకాలని కర్వా చౌత్ పర్వదినాన ఉపవాసం చేసింది దేవి. కానీ ఆమె ఉపవాసం విడవకముందే అమరుడయ్యాడు భర్త. ఉగ్రమూకల కాల్పుల్లో తీవ్రంగా గాయపడి కొనవూపిరితో ఉన్నప్పటికీ భార్యకు ఫోన్ చేసి ‘నువ్వు ఉపవాసం విడిచి ఏదన్నా తిను. నేను డ్యూటీకి వెళుతున్నాను. ఉదయం మాట్లాడతాను’ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు.
ఈ బాధాకర ఘటన ఉత్తర కశ్మీర్లో చోటుచేసుకుంది. కంగ్ర ప్రాంతానికిచెందిన సుబేదార్ కుమార్ బడ్గాం జిల్లాలో ఆర్మీ అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఆదివారం కర్వా చౌత్ పండుగను పురస్కరించుకుని కుమార్ ఆయురారోగ్యాలతో ఉండాలని భార్య దేవి ఉపవాసం చేసింది. దురదృష్టవశాత్తు అదే రోజు సాయంత్రం ఉగ్రమూకల కాల్పుల్లో కుమార్కు తీవ్రగాయాలయ్యాయి.
ఆఖరి సారిగా భార్యతో మాట్లాడాలని ఆమెకు ఫోన్ చేశాడు. తన కోసం దేవి ఉపవాసం చేస్తోందని తెలిసి ‘నువ్విక భోజనం చేసెయ్. నేను డ్యూటీకి వెళుతున్నాను. ఉదయం మాట్లాడతాను’ అని చెప్పాడు. ఇంతలో కుమార్ కాల్పుల్లో చనిపోయినట్లు సోమవారం ఉదయం దేవికి ఫోన్ వచ్చింది. భర్త మరణాన్ని జీర్ణించుకోలేక ఆమె కన్నీరుమున్నీరైంది. మంగళవారం కుమార్ భౌతికకాయానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
