ఏపీలో గతసార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి జనసేన మద్ధతు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-జనసేన మధ్య దోస్తీ ప్రశ్నార్ధకంగా మారుతోంది. ఇప్పటికే రెండు పార్టీల బంధంపై అందరిలోనూ సందేహాలు నెలకొంటున్న క్రమంలో జనసేన మీడియా హెడ్ హరిప్రసాద్ మరింత స్పష్టత ఇచ్చారు. అంతేకాకుండా ప్రతేక హోదా విషయంలో వైసీపీతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన జనసేన పార్టీ నేత హరిప్రసాద్.. పవన్ కల్యాణ్ ఎవరో తెలియదన్న మంత్రి పితాని వ్యాఖ్యలను తిప్పికొట్టారు. ఆయన ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నారని ప్రజల్లోకి వచ్చి ప్రజాదరణ చూసి మాట్లాడాలని ఎద్దేవా చేశారు.
ఇక ఈ కామెంట్లు టీడీపీ-జనసేన దోస్తీపై ప్రభావం చూపించవా అని అడిగిన ప్రశ్నకు ఆయన ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. టీడీపీ- జనసేన దోస్తీ 2014 ఎన్నికల వరకే పరిమితమని తేల్చేశారు. ఈ సందర్భంగా మరో ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. ప్రత్యేక హోదా కోసం వైసీపీతో కలిసి పనిచేసేందుకు సిద్దమని సంచలన విషయాన్ని ప్రకటించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇరకాటంగా మారిన ప్రత్యేక హోదా విషయంలో జనసేన ప్రత్యేక కార్యాచరణ ప్రకటించడం.. పైగా ఆయన రాజకీయ ప్రత్యర్థి అయిన వైసీపీతో ముందుకు సాగుతామని జనసేన ప్రకటించడం చూస్తుంటే.. టీడీపీ నేతలు పవన్ను రెచ్చగొట్టిన ఫలితమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.