బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ సినిమా అనగానే చరిత్ర, భారీ నిర్మాణ విలువలు గుర్తొస్తాయి. దర్శకత్వం వహించినా, నిర్మాతగా ఉన్నా ఆయన సినిమాల్లో భారీ తనాన్ని మాత్రం ఎక్కడా మిస్ కాకుండా చూసుకుంటారు. దేవదాస్, రామ్ లీలా, బాజీరావ్ మస్తానీ సినిమాలు చూస్తే బన్సాలీ ఏంటో అర్థమైపోతుంది. ఇప్పుడు అదే కోవలో మరో భారీ చిత్రం పద్మావతి చిత్రాన్ని బన్సాలీ స్వీయదర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు. పద్మావతి ట్రైలర్‌తో బన్సాలీ మరోసారి ప్రేక్షకులను మరోప్రపంచంలోకి తీసుకెళ్ళి మెస్మరైజ్ చేశాడు. అదో వెండితెర అద్భుతం కాబోతున్నట్లు సంకేతాలు ఇచ్చేశాడు.
పద్మావతిగా దీపికా పదుకొనే, మహారావల్ రతన్ సింగ్‌గా షాహిద్ కపూర్.. సుల్తాన్ అల్లాఉద్దీన్ ఖిల్జీగా రణ్‌వీర్ సింగ్ లుక్ అదిరింది. అప్పటి పద్మావతి, రతన్ సింగ్ ఎలా ఉండేవారో తెలియదు కానీ ఇప్పుడు దీపికా, షాహిద్‌ను చూస్తుంటే ఇలానే ఉండేవారేమో అనిపిస్తోంది. ఇక ఇప్పటికే వచ్చిన ఖిల్జీ ఫస్ట్‌లుక్‌పై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇప్పుడు ట్రైలర్‌లో చూపించిన ఖిల్జీ పాత్ర సినిమాపై మరింత అంచనాలను పెంచేస్తోంది. మూడు నిముషాలకు పైగా సాగిన ఈ ట్రైలర్‌లో సంజయ్ లీలా భన్సాలి టేకింగ్‌తో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రధాన హైలైట్స్ గా చెప్పవచ్చు. విజువల్స్ రీచ్‌గా ఉన్నాయి. యుద్ధ సన్నివేశాలు ఈ చిత్రంలో హైలెట్ అయ్యేలా ఉన్నాయి. ఇక కధను పెద్దగా రివీల్ చేయనప్పటికీ, రణవీర్ – షాహిద్ కపూర్ ల మధ్య యుద్ధ సన్నివేశాలే హైలైట్ గా ఈ సినిమా తెరకెక్కిందని ట్రైలర్ చెప్తోంది. అయితే ఇలాంటి సినిమాలను అద్భుతంగా తీయడంలో సంజయ్ లీలా భన్సాలిది అందెవేసిన చేయి గనుక, ఆయనపైనే ట్రేడ్ వర్గాలు విశ్వాసం పెట్టుకున్నాయి.