ప్రముఖ సినీనటుడు రాజశేఖర్‌ను యాక్సిడెంట్ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి హైదరాబాద్ లోని పీవీ ఎక్స్‌ప్రెస్ హైవే పై రాజేంద్రనగర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. వేగంగా వచ్చిన రాజశేఖర్ కారు.. రామిరెడ్డి అనే వ్యక్తి ఫార్చూనర్ కారును ఢీ కొట్టినట్టుగా సమాచారం. దీనిపై రాజశేఖర్‌తో వాగ్వాదానికి దిగిన రామిరెడ్డి, రాజశేఖర్ తన కారును ప్రమాదానికి గురి చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాజశేఖర్ తాగి కారు నడిపి ప్రమాదానికి కారణం అయ్యాడని రామిరెడ్డి తన పిర్యాదులో పేర్కొన్నాడు.
అయితే ఈ వ్యవహారంపై రాజశేఖర్ కుటుంబ సభ్యులు రామిరెడ్డితో చర్చలు జరిపి ఫిర్యాదును వెనక్కు తీసుకునేలా చేసినట్టు సమాచారం. రాజశేఖర్ తాగి కారు నడపలేదని బ్రీత్ ఎనలైజర్ టెస్టులో తేలినట్టుగా పోలీసులు కూడా తెలిపారు. దీంతో రామిరెడ్డి తన ఫిర్యాదును వెనక్కు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. రాజశేఖర్ తల్లి ఇటీవలే మరణించడంతో డిప్రెషన్లోనే కారు నడపడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని నటుడి కుటుంబీకులు తెలిపారు. ప్రమాదం చిన్నదే అని, ఇరు పక్షాలూ రాజీ పడినట్టుగా వివరించారు. రాజశేఖర్‌కు బ్రీత్ ఎనలైజింగ్ టెస్టును నిర్వహించామని, ఆయన మద్యం సేవించలేదని తేలిందని.. ఈ ఘటనపై కేసు నమోదు చేయడం లేదని రాజేంద్రనగర్ ఎస్ఐ శేఖర్ రెడ్డి తెలిపారు.