మహిళలపై లైంగిక దాడులు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. తాజాగా వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ గిరిజన మహిళ(48)పై రాజేంద్రనగర్ ఉప్పర్‌పల్లికి చెందిన మరో గిరిజన యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. శనివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకోగా.. బాధితురాలి ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ గిరిజన మహిళ రాజేంద్రనగర్ ఉప్పర్‌పల్లిలో నివాసముండే తన కుమారుల వద్దకు వచ్చింది. శనివారం సాయంత్రం ఏదో పని నిమిత్తం తెలిసినవారి ఇంటికి వెళ్లింది. అక్కడి నుంచి తిరిగి ఇంటికి బయలుదేరిన సమయంలో.. మార్గమధ్యలో జోరు వాన మొదలైంది. దీంతో దారిలో ఉన్న ఓ ఇంటి ముందు నిలబడింది.
వర్షం మరింత జోరందుకోవడంతో ఆమె తడవడం మొదలైంది. ఇది గమనించిన ఆ ఇంటి వ్యక్తి రాజునాయక్(23)ఆమెను ఇంట్లోకి పిలిచాడు. తాను కూడా గిరిజనుడినే అని పరిచయం చేసుకుని అదే భాషలో మాట్లాడాడు. దీంతో అతని మాటలు నమ్మి ఆమె ఇంట్లోకి వెళ్లింది.
కాసేపటికే.. ఇంటి తలుపులు మూసేసి, విద్యుత్ సరఫరా నిలిపివేసి ఆ గిరిజన మహిళపై రాజు నాయక్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఊహించని ఘటనతో బాధితురాలు దిగ్భ్రాంతికి గురైంది. బాధితురాలు శనివారం రాత్రి రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
