మద్యం తాగి వాహనాలు నడిపేవారిపై ఉన్న నిబంధనలు కొంత మేరకు సడలించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. డ్రంకెన్ డ్రైవ్ లో చిక్కి, కౌన్సెలింగ్ కు హాజరు కాని వారి సంఖ్య కొన్ని వేలల్లో ఉంటుండగా, వారి వాహనాలన్నీ ట్రాఫిక్ పోలీసు స్టేషన్లలో కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్నాయి. వాటి సంరక్షణ భారం పోలీసుశాఖా కి తలనొప్పిగా మారింది .
కొత్త విధానాన్ని రూపొందించాలని యోచిస్తున్నట్టు హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఏవీ రంగనాథ్ తెలిపారు. ప్రస్తుతం 100 ఎంఎల్ బ్లడ్ లో 30 ఎంజీ బీఏసీ (బ్లడ్ ఆల్కహాల్ కౌంట్) ఉంటే పట్టుకుంటూ, వారి వాహనాలను స్పాట్ లో సీజ్ చేయడంతో పాటు, కౌన్సెలింగ్ చేస్తున్నారన్న సంగతి తెలిసిందే. కౌన్సెలింగ్ కు వివాహితుడైతే భార్యను, పెళ్లికాకుంటే తల్లిదండ్రుల్లో ఓకరిని లేదా దగ్గరి బంధువును కూడా తీసుకురావడం తప్పనిసరి కాగా, వాహనాలను వదిలేసుకుంటున్న మందుబాబులు, కౌన్సెలింగ్ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఈ నేపద్యంలో స్టేషన్లలో పేరుకుపోయిన వాహనాల సంఖ్య 3,760కి చేరింది. దీంతో బీఏసీ కౌంట్ ను 100కు సవరించి, అంతకన్నా ఎక్కువ మోతాదులో మద్యం తాగి దొరికితేనే వారికి కౌన్సెలింగ్ వర్తింపజేసే ఆలోచనలో ఉన్నట్టు రంగనాథ్ వెల్లడించారు.
కాగా, 60 ఎంఎల్ మద్యం సేవిస్తే శరీరంలో 30 బీఏసీ నమోదవుతుంది. ఆపై ఓ అరగంట ఎక్కడైనా గడిపి వాహనం నడుపుతూ వెళ్లి డ్రంకెన్ డ్రైవ్ లో దొరికినా, ఆ పాటికి బీఏసీ తగ్గిపోతుంది. ఇక 30 బీఏసీ కౌంట్ ను 100కు సవరిస్తే, నిరభ్యంతరంగా ఓ క్వార్టర్ మందేసి బండెక్కి డ్రైవ్ చేసుకుంటూ మందుబాబులు హాయిగా ఇంటికి వెళ్లిపోవచ్చు.