ప్రతి రోజు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్రవాహనదారులే ఎక్కువగా ఉంటున్నారు. కేవలం హెల్మెట్ ధరించకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోతున్నారు..దీంతో వారి కుటుంబాలు అంతులేని విషాదంలో మునిగిపోతున్నాయి..అయినా వాహనచోదకుల్లో మార్పు రావడం లేదు.. హెల్మెట్ ధరించండి అంటూ పోలీస్, రవాణాశాఖ ప్రచారం చేస్తూనే ఉన్నాయి..తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ఎంపీ కవిత సిస్టర్స్ ఫర్ ఛేంజ్ అంటూ రాఖీ పండుగ సందర్భంగా ప్రతి అక్కా చెల్లెలు తమ సోదరులకు హెల్మెట్‌ను గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా పిలుపు ఇచ్చింది. ఇక ఏపీ ప్రభుత్వం హెల్మెట్ ధరించకపోతే పెట్రోల్ బంక్‌లో ద్విచక్రవాహనదారులకు పెట్రోలు పోయడానికి వీల్లేదు అంటూ ఆర్డర్లు జారీ చేసింది. ఇక పోలీస్ అధికారులు కూడా హెల్మెట్ వినియోగం పై ప్రజలకు వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇటీవల కరీంనగర్‌లో ఓ పోలీస్ అధికారి హెల్మెట్ లేని వాహనదారుడిని అడ్డుకుని
అక్కడే ఉండమని చెప్పి ఓ షాపుకు వెళ్లి రూ. 500 పెట్టి హెల్మెట్ కొనిచ్చి ఆదర్శంగా నిలిచాడు. హెల్మెట్ వాడకంపై సదరు ఎస్‌ఐ చేసిన మంచి పనికి సర్వత్రా ప్రశంసల జల్లు కురిసింది. తాజాగా అనంతపురం జిల్లా, మడకశిర ఎస్‌ఐ శుభాకుమార్ హెల్మెట్ వినియోగంపై వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. రోడ్డు మీద హెల్మెట్ లేకుండా వెళుతున్న వాహనాదారులను ఆపి , దండం పెట్టి మరీ రోడ్డు సేఫ్టీ కోసం నియమ నిబంధనలు పాటించాలని, మీ ప్రాణాలకు రక్షణ కోసం, మీ కుటుంబ క్షేమం కోసం దయ చేసి హెల్మెట్ కొనాల్సిందిగా చేతులెత్తి మొక్కుతున్నారు.. ఈ పోలీస్ అధికారి చేస్తున్న వినూత్న ప్రచారం వాహనదారుల్లో మార్పు తీసుకువస్తోంది. వెంటనే తాము హెల్మెట్ కొంటామని ఆయనకు మాట ఇవ్వడమే కాకుండా వెంటనే హెల్మెట్ కొంటున్నారని మడకశిర పోలీసులు అంటున్నారు.. మొత్తానికి ప్రజల భద్రత కోసం ఈ ఎస్‌ఐ చేస్తున్న వినూత్న ప్రచారానికి ప్రతి ఒక్కరూ హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే…
