న్యూఢిల్లీలోని లోధీ ఎస్టేట్ మేనేజర్ సుభాష్ తనపై అత్యాచారం చేసి ఆస్తి రాయించుకున్నాడని ఆరోపిస్తూ ఓ తెలంగాణ మహిళ(32) అక్కడి పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళ్తే.. న్యూఢిల్లీలోని లోధీ ఎస్టేట్‌కు సుభాష్ అనే యువకుడు మేనేజర్. అందులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళ ఒకరు 14సంవత్సరాలుగా పనిమనిషిగా పనిచేస్తోంది. ఆమెతో పాటు మరో ఇద్దరు పనిమనుషులు కూడా అందులో పనిచేస్తున్నారు. ఇదే క్రమంలో మాయ మాటలు చెప్పి సుభాష్ ఆమెను లోబరుచుకున్నాడు. మహిళకు రూ.25లక్షలు ఇస్తానని చెప్పి ఆమె ఇంటిని తన బంధువు పేరిట రిజిస్టర్ చేయించుకున్నాడు.
డబ్బుల కోసం ఇంటిని అమ్మిన ఆమెకు డబ్బు మాత్రం చేతికి రాలేదు. ఇదేంటని నిలదీస్తే దాటవేసే ప్రయత్నం చేస్తూ వచ్చాడు. గత సెప్టెంబర్ 23, 2015న సుభాష్ ఎస్టేట్ నుంచి వెళ్లిపోయాడు. ఫోన్ ద్వారా అతన్ని సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ.. అతను అందుబాటులోకి రాలేదు. దీంతో విసిగిపోయిన మహిళ.. మోసపోయానని గ్రహించి.. ఢిల్లీ పోలీసులను ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాల్సిందిగా వేడుకుంది. తనపై నాలుగుసార్లు అత్యాచారం చేసి, ఆస్తి రాయించుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహిళను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.