తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రతిపక్షాలు వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వానిది కుటుంబ పాలన అని విమర్శించడం సరికాదన్నారు. ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. విద్యుత్, నీరు అంశాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందని స్పష్టం చేశారు మంత్రి తలసాని.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత 9 గంటల విద్యుత్ అందించిన ఘనత ప్రభుత్వానిది అని పేర్కొన్నారు. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు.
పేద విద్యార్థులకు విద్యను అందించేందుకు గురుకులాలను ఏర్పాటు చేశామని తెలిపారు. విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం అందిస్తున్నామని గుర్తు చేశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రభుత్వం కృషి చేస్తుందని ఉద్ఘాటించారు.
అన్ని కమ్యూనిటీలకు చెందిన పండుగలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని తెలిపారు. ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నామని చెప్పారు. ఇన్ని మంచి కార్యక్రమాలు అందిస్తున్న ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం దారుణమని మంత్రి తలసాని మండిపడ్డారు.