టీం ఇండియా స్పూర్తితో ముందుకు సాగాల్సిన కేంద్ర ప్రభుత్వం ఆచరణలో ఆ వైఖరిని ప్రదర్శించడం లేదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి విషయంలో శీతకన్ను వేసినట్లు పలు ఉదంతాల్లో స్పష్టంగా కనిపిస్తోందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం చేయాల్సిన హామీలు కూడాఅమలు కాలేదని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి కేటీఆర్ అనేక అంశాలపై స్పందించారు.
బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిలో లేని పార్టీల ఏలుబడిలో ఉన్న రాష్ట్రాల్లో అభివృద్ధి విషయంలో కేంద్రం పక్షపాతం చూపుతోందని, ఇది సరైన విధానం కాదని తాము భావిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఢిల్లీ-ముంబై ఇండస్ట్రీయల్ కారిడార్ పైనే ఎక్కువగా దృష్టి సారించడం…దక్షిణాదిలోని హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ప్రాంతాల్లోని ఇండస్ట్రీయల్ కారిడార్ల విషయంలో దృష్టి సారించకపోవడం విషయంలో పలువర్గాల్లో అసంతృప్తి ఉందని మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు.
ఈ విషయంలో పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతో కలిసి పారిశ్రామిక, ఇతర అంశాల విషయంలో కేంద్రం తీరుపై చర్చించే అవకాశం ఉందా అని సదరు మీడియా సంస్థ ప్రశ్నించగా…‘‘ అభివృద్ధి కోణంలో ఢిల్లీ-ముంబై ఇండస్ట్రీయల్ కారిడార్ దాటి ఆలోచించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. తాజాగా ప్రకటించిన బుల్లెట్ ట్రైన్ విషయంలో మరోమారు అదే కారిడార్‌ను ఎంచుకున్నారు. ఉత్తరాది లాగే…దక్షిణాది సైతం దేశ అభివృద్ధికి సహకరిస్తున్న అంశాన్ని గమనించాలి. కేంద్ర ప్రభుత్వం మా ఆవేదనలను పరిగణనలోకి తీసుకోకపోతే…ఇరుగు పొరుగున ఉన్న దక్షిణాది రాష్ట్రాలతో ఈ విషయంపై చర్చించాలని మా ముఖ్యమంత్రి దృష్టికి తప్పకుండా తీసుకుపోతాం’అని మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్రాలకు నిధులు అందించడం పెరిగింది అయితే కొన్ని అంశాల్లో మాత్రం స్పష్టమైన తేడా కనిపిస్తోందని..కొన్ని అంశాల్లో స్పష్టమైన పక్షపాతం ఉందని తాను భావిస్తున్నానని పేర్కొన్నారు
తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం లేదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ‘బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ నిలబెట్టుకోలేదు. రాష్ట్ర విభజన హామీల విషయంలో ఏపీలో ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా దక్కింది కానీ తెలంగాణలో ఏ ప్రాజెక్టుకు అలాంటి హోదా ఇవ్వనేలేదు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ పలు దఫాలుగా కేంద్ర ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ….ఇంకా పెండింగ్‌లోనే ఉంచారు. హైదరాబాద్ ఐటీ అభివృద్ధికి కీలకమైన అంశంగా భావిస్తున్న ఐటీఐఆర్ జోన్‌ను నోటిఫై చేయడంలో కేంద్రం వైఫల్యం చెందింది. ఇది సరైనది కాదు. పార్లమెంటు సాక్షిగా ప్రస్తుత ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ తెలంగాణకు ఎయిమ్స్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ అది ఆచరణ రూపం దాల్చలేదు’ అని పేర్కొన్నారు.
Post Views: 417