పెద్దనోట్ల రద్దు సందర్భంగా రూ.500.. రూ.1000 నోట్లను ముక్కలు ముక్కలు చేసేయటం.. గుట్టలు గుట్టలుగా పోసేసి కాల్చేసిన వైనం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. పెద్దోళ్ల ఇళ్లల్లో దాచేసిన నోట్ల కట్టల్ని ఏం చేసుకోవాలో తెలీక.. అలా అని బయటకు తీసుకొస్తే వచ్చే చిక్కులకు భయపడి కాల్చేయటం కనిపించింది.
ఇదిలా ఉంటే.. చలామణిలో ఉన్న వంద రూపాయిల నోట్లను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కుప్పలుగా పడేసిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. కర్ణాటకలోని మండ్య జిల్లాలోని రాగిముద్దనహళ్లి గ్రామంలో నింగేగౌడ అనే రైతు పొలంలో ముక్కలు ముక్కలు చేసిన వంద రూపాయిల నోట్లు కనిపించటంతో. . ఆవిషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు.
చలామణిలో ఉన్న వంద నోట్లను ఎందుకు పడేశారు? ఎవరు పడేశారు? అన్నది అర్థం కాని పరిస్థితి. నోట్ల ముక్కల్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు దీనికి బాధ్యులు ఎవరన్న అంశంపై విచారణ జరుపుతున్నారు. బ్లాక్ మనీ బయటకు రాకుండా ఉండేందుకు ఇలా చేసి ఉంటారేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.