తనను పుట్టింట్లో వదిలేసి మరో యువతితో ఉన్న కానిస్టేబుల్ భర్తను పట్టించింది ఓ భార్య. ఈ సంఘటన శనివారం ప్రహ్లాదపురంలో చోటు చేసుకుంది. తాను తప్పుచేయలేదని, స్నేహితురాలు తన సమస్యను చెప్పుకునేందుకు ఇంటికి వస్తే కుట్రపన్ని అక్రమ సంబంధం అంటగట్టారని గాజువాక ట్రాఫిక్ విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ప్రసాద్ అంటున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆరిలోవకు చెందిన కె.ప్రసాద్, దుర్గలకు 2014లో వివాహమైంది. రెండేళ్లు వీరి కాపురం సజావుగా సాగింది.
2016 నుంచి వారి మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. ప్రసాద్ భార్యను ఆరిలోవలోని పుట్టింట్లో వదిలేసి ప్రహ్లాదపురంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఒంటరిగా ఉంటున్నాడు. భర్త ఎక్కడ ఉన్నాడో తెలియని దుర్గా అతని గురించి ఆరా తీయగా, ప్రహ్లాదపురంలో ఉంటున్నట్టు సమాచారం అందింది. ఒంటరిగా ఉంటున్నాడా…మరో మహిళతో ఉన్నాడా అని రహస్యంగా పరిశీలించింది. శనివారం ఓ మహిళ ప్రసాద్ ఇంటికి వచ్చింది. భర్త, ఆ మహిళ ఇంట్లో ఉండగా దుర్గ తలుపులు వేసి తాళం వేసేసింది. వెంటనే మీడియాకు, స్థానికులు, పోలీసులకు సమాచారం అందించింది.
పెద్దఎత్తున జనం గుమిగూడారు. గోపాలపట్నం సీఐ వైకుంఠరావు నేతృత్వంతో పోలీసులు అక్కడికి చేరుకుని గదిలో ఉన్న కానిస్టేబుల్‌ని, మహిళను బయటకు తీసుకువచ్చారు. ఇరువర్గాలను గోపాలపట్నం పోలీసుస్టేషనుకు తీసుకెళ్లి విచారణ చేస్తున్నారు. తనను వివాహం చేసుకున్నప్పటి నుంచి సరిగా చూసుకోవడంలేదని, కట్నం కోసం వేధిస్తున్నాడని దుర్గా పోలీసుస్టేషనులో ఫిర్యాదు చేసింది.భార్య దుర్గ తనపై అసత్య ఆరోపణలు చేస్తోందని, ఆమె ఎప్పుడూ తనను అనుమానిస్తూ ఉండేదని కానిస్టేబుల్ సీఐకి తెలిపారు. కుటుంబ వ్యవహారం కావడంతో ఇద్దరికి కౌన్సెలింగ్ ఇస్తామన్నారు. వాస్తవాలను పరిశీలించి కానిస్టేబుల్ తప్పుచేసినట్టు నిరూపణ అయితే తగు చర్యలు తీసుకుంటామని సీఐ వైకుంఠరావు తెలిపారు.