ఏపీలో మరో నేరం బట్ట బయలైయ్యింది. విజయవాడలో ‘జీసస్ మిరాకిల్స్’ పేరిట చర్చి నడుపుతూ, తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల సభలు, సమావేశాలు నిర్వహిస్తూ పరిశుద్ధ జలం విక్రయాలు సాగిస్తున్న పాస్టర్ ప్రదీప్ కుమార్ రాసలీలలను మరో పాస్టర్ బయటపెట్టారు. దీంతో బెజవాడలో క్రైస్తవ సంఘాల మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. అమ్మాయిలతో ప్రదీప్ సన్నిహితంగా ఉన్న వీడియోలు, ఓ హోటల్ గదిలో మద్యం తాగుతున్న దృశ్యాలు వెలుగులోకి రావడంతో చర్చనీయాంశమయ్యాయి. ‘
జీసస్ మిరాకిల్స్’ పేరిట ప్రదీప్ అనేక అక్రమాలకు, అరాచకాలకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ ఓ షార్ట్ ఫిల్మ్ కూడా యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది. ఈ షార్ట్‌ఫిల్మ్‌ను అరవిందసాయి అనే యువకుడు ప్రదీప్ జీవన విధానంపై రహస్యంగా చిత్రీకరించినట్టు సమాచారం.
అమ్మాయిలతో తిరుగుతూ, మద్యం సేవిస్తూ, అమాయకులైన ప్రజలను ప్రదీప్ ఎలా మోసం చేస్తున్నాడన్న విషయాన్ని ఇందులో స్పష్టంగా తెలియజేశారు. అయితే ప్రదీప్‌కు, ‘ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్’ సంస్థ చీఫ్ బ్రదర్ విజయ ప్రసాద్‌కు మధ్య విభేదాలు ఉన్నాయని, ఆ కారణంతోనే ఈ వీడియోలు బయటకు వచ్చాయని బెజవాడ జనం చెవులు కొరుక్కుంటున్నారు. ప్రదీప్‌తోపాటు ఆయన తల్లిదండ్రులు కూడా విలాసవంతమైన జీవితాన్న గడుపుతున్నట్లు షార్ట్‌ఫిల్మ్‌లో చూపించారు. అంతేకాదు పడకగదిలో మద్యం సేవిస్తూ బైబిల్‌ను కాలు దగ్గర పెట్టుకున్న దృశ్యాలు ఇందులో ఉన్నాయి. ప్రదీప్, తన అనుచరులు సైతం మద్యానికి బానిసలుగా మారినట్లు చూపించారు.