శుక్రవారం తెల్లవారుజామున రష్యాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. పెటుషిన్స్కీ ప్రాంతంలోని పొక్రోవా రైల్వే స్టేషన్ వద్ద రైలు.. బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారితోపాటు 19మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరికొందరు తీవ్రగాయాలపాలయ్యారు. ప్రమాదానికి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణంగా తెలుస్తోంది. రైలు వస్తుందన్న విషయాన్ని గమనించకుండా డ్రైవర్ పట్టాలు దాటేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే వేగంగా వస్తున్న రైలు.. బస్సును ఢీకొంది. క్షతగాత్రుల్లో చిన్నారులు, మహిళలు ఉన్నారు.
గాయాలపాలైన వారిని సహాయక సిబ్బంది వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఉజ్బెకిస్తాన్ నుంచి కార్మికులను తీసుకుని వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాగా, నెంబర్ ప్లేట్ ఆధారంగా ప్రమాదానికి గురైన బస్సు కజకిస్థాన్లో రిజిష్టర్ అయిందని రష్యా అధికారులు తెలిపారు.