ఈ రోజు రాంచీ లో ఆసీస్‌తో జరిగిన తొలి ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో టీం ఇండియా విజయఢంకా మోగించింది. మొదట టాస్ గెలిచిన టీంఇండియా ఆసిస్ కు బ్యాటింగ్ అప్పజేప్పడంతో మొదట బ్యాటింగ్ చేసిన ఆ జట్టు 18.4 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. అయితే మధ్యలో వర్షం కారణంగా దాదాపు గంటన్నరపాటు మ్యాచ్‌కు అంతరాయం కలిగింది.
దీంతో డక్‌వర్త్‌లూయిస్ ప్రకారం భారత్‌కు 6 ఓవర్లలో 48 పరుగుల లక్ష్యం నిర్దేశించారు. అనంతరం ఛేదన ప్రారంభించిన భారత్ 5.2 ఓవర్లలో కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.టీం ఇండియా బ్యాట్స్మెన్లలో రోహిత్ శర్మ(11), శిఖర్ ధావన్(15), విరాట్ కోహ్లీ(22) పరుగులు చేశారు. అంతకు ముందు కెప్టెన్ కోహ్లి నమ్మకాన్ని బౌలర్లు వమ్ము కానివ్వలేదు.
ఇన్నింగ్స్ స్టార్టింగ్ లో వరుసగా రెండు ఫోర్లు బాది వూపు మీదున్న కెప్టెన్ వార్నర్(8)ను స్టార్ బౌలర్ భువనేశ్వర్ క్లీన్‌బౌల్డ్ చేసి వికెట్ల పతనానికి నాంది పలికాడు. మరోవైపు ఓపెనర్ ఫించ్(42) రాణించినా కానీ మాక్స్వెల్(17), హెడ్ (9), హెన్రిక్స్(8), క్రిస్టియన్(9), పెయిన్(17), నైల్(1) స్వల్ప స్కోర్లకే అవుటయ్యారు. మరో విశేషం ఏమిటి అంటే ఆసీస్ బ్యాట్స్మెన్లలో ఐదుగురు క్లీన్‌బౌల్డ్ కావడం .. టీం ఇండియా బౌలర్లలో కుల్దీప్ 2వికెట్లు , బుమ్రా 2వికెట్లు , భువనేశ్వర్, పాండ్య, చాహల్ తలో వికెట్ తీశారు.