ఏపీలో ఇటీవల నంద్యాల ఉప ఎన్నికల విజయంతోపాటు కాకినాడలో కార్పొరేషన్ గెలిచాక వైసీపీని ఇబ్బందుల్లోకి నెట్టాలని వైసీపీ నుంచి 11 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారంటూ టీడీపీ అనుకూల మీడియా వారు తెగ డప్పుకొట్టారు. ఆ జాబితాలో శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్యేల నుంచి కర్నూలు జిల్లా ఎమ్మెల్యేల వరకూ ఉన్నారని.. టీడీపీ నేతలు కూడా ఈ విషయాన్ని బహింరంగంగానే ప్రకటించారు. తమకు ముందు నుంచే అనేకమంది టచ్‌లో ఉన్నారనీ, నంద్యాల ఉప ఎన్నికల ఓటమి తర్వాత పార్టీలో చేరేందుకు మరింత ఆసక్తి కనబరుస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్ కూడా చెప్పారు. ఆ తర్వాత మంత్రి ఎర్రంన్నాయుడతోపాటు పలువురు మంత్రులు వైసీపీ ఎమ్మెల్యేలు తమకు టచ్‌లో ఉన్నారని ప్రకటించారు. దసరాకు ముహూర్తం పిక్స్ అని కూడా ప్రచారం జరిగింది. అయితే దసరా పోయి దీపావళి వస్తున్నా.. ఒక్క వైసీపీ నుంచి ఒక్క ఎమ్మెల్యే టీడీపీలో చేరలేదు.
2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార టీడీపీ, వైసీపీలు వ్యూహ రచన చేస్తున్నాయి. అయితే విషయంలో టీడీపీ ఒకింత వేగంగా ఉంది. తమ బలం పెంచుకోవడంతోపాటు ఎదుటి పార్టీని బలహీనపరచడమే ధ్యేయంగా పావులు కదుపుతోంది. అందులో భాగంగానే వైసీపీని బలహీన పరిచేందుకు కొత్త వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. ఎమ్మెల్యేలు, నాయకులు పార్టీలు మారడం సహజమే. అయితే ఇంత పెద్ద ఎత్తున తమ పార్టీలోకి ఎమ్మెల్యేలు రావడానికి సిద్ధంగా ఉన్నారని ప్రకటించడం ద్వారా ప్రతిపక్షాన్ని ఆత్మ రక్షణలో పడేయవచ్చు. అది ఆ పార్టీ శ్రేణుల్లోనూ నిరుత్సాహాన్ని నింపుతుంది. అందుకే టీడీపీ ఆపరేషన్ ఆకర్ష మంత్రంతో మైండ్‌గేమ్ మొదలుపెట్టింది. టీడీపీ నేతలు వైసీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరేందుకు రెడీగా ఉన్నారంటూ ఊదరగొడుతున్నారు. నిజంగా వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరేందుకు ఆసక్తిగా ఉంటే ఇప్పటి వరకూ ఒక్కరూ ఎందుకు చేరలేదని సర్వత్రా ప్రశ్నిస్తున్నారు.