వివాదాలకి బ్రాండ్ అంబాసిడర్ అయిన క్రియేటీవ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తాజాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని అనౌన్స్ చేసి.. మీడియా అటెన్షన్‌ని రాబట్టడంలో సక్సెస్ అయ్యాడు. తాజాగా వర్మ ఇప్పుడు ఈ సినిమా నిర్మాత ఎవరో అనౌన్స్ చేసాడు. నిర్మాతగా వైసీపీ నేత రాకేష్ రెడ్డి వ్యవహరించనున్నట్టు ఫేస్ బుక్ ద్వారా ప్రకటించేసాడు వర్మ. ఈ చిత్రాన్ని రాజకీయాలకు అతీతంగా కేవలం నిజాలు చెప్పడం కోసమే తీయాలని అనుకుంటున్నామని పైకి అంటున్నప్పటికీ వర్మ టార్గెట్ మాత్రం ఏమిటో అందరికీ తెలుసు.
అయితే దీనిపై ఎన్టీఆర్ కూతురు, బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు. ఎన్టీఆర్ జీవితం తెరిచిన పుస్తకమని, ఆయనకు సంబంధించిన అన్ని విషయాలు అందరికీ తెలుసనని, సినిమా తీస్తే ఆయన గౌరవాన్ని పెంచేలా ఉండాలి గానీ ఒక్క కోణంలో సినిమా తీయాలనుకోవడం కరెక్ట్ కాదని సుచించారు పురంధేశ్వరి. ఒకవేళ సినిమా తీయాలనుకుంటే, నిర్మాణాత్మకంగా ఎన్టీఆర్ జీవితంలో జరిగిన అన్ని విషయాలను చూపించే ప్రయత్నం చేయాలి తప్ప ఇలా ఏక కోణంలో సినిమా నిర్మించాలనుకోవడం సరికాదని పురంధేశ్వరి సలహా ఇచ్చారు.