తెలంగాణ రాష్ట్ర౦లో జిల్లా కేడర్ పోస్టులకు కొత్త జిల్లాలే ప్రతిపాదిక అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు, జోనల్ వ్యవస్థ, రాష్ట్రపతి ఉత్తర్వులు, తదితర అంశాలపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఈ సమీక్ష సమావేశానికి మంత్రులు, సీనియర్ అధికారులు హాజరయ్యారు. జిల్లా కేడర్ పోస్టులను కొత్త జిల్లాల ప్రతిపాదికనే నియమించాలని సీఎం నిర్ణయించారు. డీఎస్సీ నోటిఫికేషన్ కూడా కొత్త జిల్లాల వారీగా జారీ చేయాలని నిర్ణయించారు. స్థానికులకు ఎక్కువ అవకాశాలు రావాలనే ఉద్దేశ్యంతోనే కొత్త జిల్లాల ప్రకారం పోస్టుల భర్తీ జరుగుతుందన్నారు. కొత్త జిల్లాల ప్రాతిపదికనే జిల్లా కేడర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు సీఎం.
జోన్ల వ్యవస్థకు స్వస్తి పలికి కేవలం జిల్లా, స్టేట్ క్యాడర్ మాత్రమే ఉంచి నియామకాలు చేపట్టాలా? జోన్ల వ్యవస్థను కొనసాగించాలా? అనే అంశంపై తమ అభిప్రాయాలను ఉన్నతాధికారులు వ్యక్తం చేశారు. కేవలం జిల్లా, స్టేట్ క్యాడర్ మాత్రమే ఉండటం వల్ల వచ్చే ప్రయోజనాల కన్నా.. ఇబ్బందులే ఎక్కువగా ఉంటాయని మంత్రులు, అధికారులు సీఎంకు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఉద్యోగార్థులకు, పరిపాలనకు అనువుగా జిల్లా, జోనల్, మల్టీ జోనల్, స్టేట్ క్యాడర్ పోస్టులు ఉండాలని తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. మంత్రులు, అధికారుల అభిప్రాయాన్నే అడ్వకేట్ జనరల్, లా సెక్రటరీ వ్యక్తం చేశారు. ఈ నాలుగు కేడర్ల పోస్టులు కొనసాగించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. కొత్త జోన్ల ఏర్పాటు అనివార్యమైన నేపథ్యంలో పాత రాష్ట్రపతి ఉత్తర్వుల స్థానంలో కొత్తగా ఉత్తర్వులు ఇవ్వాలని.. కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని అడ్వకేట్ జనరల్ ప్రకాశ్‌రెడ్డి సూచించారు.