ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీస్‌శాఖకు తీపి కబురు అందించారు .. పోలీస్‌శాఖలో పదోన్నతులకు సీఎం కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న పోలీసు అధికారుల పదోన్నతి అంశం ఓ కొలిక్కి వచ్చినట్లైంది. పోలీసు అధికారుల పదోన్నతుల అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రగతిభవన్ లో న్యాయశాఖ అధికారులు, పోలీసు అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులతో దాదాపు నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. ఏకంగా 275 మందికి నాన్ క్యాడర్ ఎస్పీలుగా, ఎఎస్పిలుగా, డిఎస్పీలుగా పదోన్నతులు కల్పించాలని సీఎం నిర్ణయించారు. దీంతో 1994 బ్యాచ్ వరకు ప్రతీ పోలీసు అధికారికి పదోన్నతి లభిస్తుంది. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి శనివారం రాత్రి సంతకం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా 139 మంది సిఐలకు డిఎస్పీలుగా, 103 మంది డిఎస్పీలకు ఎఎస్పీలుగా, 33 మంది ఎఎస్పీలకు నాన్ క్యాడర్ ఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. పదోన్నతులు కల్పించిన వారితో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని, అవసరమనుకుంటే సూపర్ న్యూమరీ పోస్టులు కల్పించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని సిఎం ప్రకటించారు. అర్హులైన వారందరికీ ఎలాంటి వివక్ష లేకుండా సకాలంలో పదోన్నతి లభించాలి. కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్ లో అలాంటి న్యాయం జరగలేదన్నారు. దీనివల్ల కొంతమందికి అన్యాయం జరిగింది. గతంలో ఇన్స్పెక్టర్ స్థాయి నుండి డిఎస్పీ స్థాయి వరకు ప్రమాషన్లు ఇచ్చినప్పుడు జరిగిన తప్పొప్పులను సరిదిద్ధి, ఎవరికీ అన్యాయం జరుగకుండా చూడాలన్నారు. అన్యాయాన్ని సరిదిద్దాడానికి అవసరమైనచోట సూపర్ న్యూమరి పోస్టులను ఎర్పాటు చేయాలని సూచించారు. ఇలా చేయటం వల్ల వరంగల్ జోన్ లో ఇన్ స్పెక్టర్లకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దవచ్చు అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.