డిగ్రీ విద్యార్థిని దారుణంగా హత్యకు గురికావడం కూకట్‌పల్లి ప్రాంతంలో తీవ్ర కలకలం రేపుతోంది. సౌమ్య అనే 19 ఏళ్ల డిగ్రీ విద్యార్థిని కృష్ణయ్య అనే వ్యక్తి శుక్రవారం దారుణంగా హతమార్చాడు ‘నా మరదలిని చంపేశాను..’ అంటూ ఓ యువకుడు వచ్చి లొంగిపోయిన సంఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. అతడు చెప్పినట్లుగా సంబంధిత యువతి మృతదేహం ఆచూకీ లభించకపోవడంతో కేసు వివరాలను వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు. లొంగిపోయిన వ్యక్తి చెబుతున్న ప్రకారం వాస్తవంగా హత్య జరిగిందా.. లేదా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లొంగిపోయిన యువకుడు తెలిపిన వివరాల ప్రకారం… బోరబండ పర్వత్‌నగర్‌కు చెందిన డ్రైవర్(లొంగిపోయిన యువకుడు)కు చింతల్‌లో ఉండే తన బంధువైన యువతితో వివాహం నిశ్చయమైంది. ఆ యువతి చింతల్‌లోనే ఓ ప్రైవేటు కళాశాలలో చదువుతోంది. ఈ క్రమంలో.. ఆ యువతి మరో వ్యక్తితో చనువుగా ఉండటాన్ని జీర్ణించుకోలేకపోయాడా యువకుడు. మాట్లాడాలంటూ శుక్రవారం ఉదయం ఆ అమ్మాయిని హెచ్‌ఎంటీ ప్రాంతంలోని ఖాళీ ప్రదేశానికి రమ్మన్నాడు. మాట్లాడుతుండగా మాటామాట పెరిగి కోపంతో కొట్టగా యువతి అక్కడికక్కడే మృతిచెందింది. ఆమె మృతదేహాన్ని సంచిలో కట్టుకుని వాహనంలో తీసుకువచ్చి కూకట్‌పల్లి రంగథాముని చెరువులో పడవేశాడు. అనంతరం పర్వత్‌నగర్‌లోని తన ఇంటికి వెళ్లి సాయంత్రం కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు.
