హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు బృహత్తర పథకాలకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే వస్తువులను ఇతర ప్రదేశాలకు తరలించేందుకు, అవసరమైన ముడిసరుకులను దిగుమతి చేసుకొనేందుకు రెండు లాజిస్టిక్స్ పార్కులను అభివృద్ధి చేయనున్నారు. వస్తువుల రవాణాకు, ఎగుమతి- దిగుమతులకు అనుకూలంగా ఉన్న ఔటర్‌రింగ్ రోడ్డుకు సమీపంలో నాగార్జునసాగర్ హైవేపై ఒకటి, విజయవాడ హైవేపై మరొకటి నిర్మించనున్నారు. పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో బాటసింగారంలో రూ.35 కోట్లతో 40ఎకరాల విస్తీర్ణంలో ఒకటి.. మంగళ్‌పల్లిలో రూ.20కోట్లతో 20ఎకరాలలో మరొక పార్కును నిర్మిస్తారు.
ఈ రెండు పార్కుల నిర్మాణపనులకు పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు శంకుస్థాపనచేస్తారు. ఇందుకోసం హెచ్‌ఎండీఏ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. బాటసింగారం పనులను క్రెడాన్స్ లాజిస్టిక్స్ కంపెనీ, మంగళ్‌పల్లి పనులను కేసీపీ ప్రాజెక్ట్స్ దక్కించుకున్నాయి. రెండేండ్లలోపు 60% పనులను పూర్తిచేసి, నిర్వహణలోకి తీసుకువచ్చేలా అధికారులు ఈ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. మూడేండ్లలో మొత్తం ప్రాజెక్టు పనులను పూర్తిచేయాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ రెండు ప్రాజెక్టులతో ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మందికి ఉపాధి దొరుకనుంది.