సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) ఘనవిజయం సాధించిందితెలంగాణ బొగ్గుగని సంఘం తిరుగులేని మెజార్టీతో మరోసారి గుర్తింపు హోదా ఖరారైంది. ప్రత్యర్థులంతా ఒక్కటై కూటమి కట్టినా.. ఎన్ని దుష్ప్రచారాలు చేసినా.. టీబీజీకేఎస్ బాణం గుర్తు దూసుకుపోతున్నది. కార్మికులంతా సీఎం కేసీఆర్, ఎంపీ కవితల వెంటే నిలిచారు. భారీగా నమోదైన పోలింగ్ టీబీజీకేఎస్ విజయాన్ని కౌంటింగ్‌కు ముందే తేల్చింది. టీబీజీకేఎస్‌కు కనీసం దరిదాపుల్లో కూడా ప్రత్యర్థివర్గం నిలవలేకపోయింది. సింగరేణి కార్పొరేట్‌లో కూడా గులాబీ జెండా తొలిసారి సగర్వంగా రెపరెపలాడింది. గురువారం ఉదయం సింగరేణిలో ప్రారంభమైన గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ ముందుగా మందకొడిగా సాగినా ఆ తర్వాత పుంజుకున్నది. సాయంత్రం పోలింగ్ ముగిసేసరికి 94.93శాతం ఓట్లు పోలయ్యాయి. మొత్తం 52,534 ఓట్లలో 49,873 ఓట్లు పోలయ్యాయి.
ఏరియాలవారీగా విజయం/మెజారిటీ వివరాలు..
సింగరేణి భవన్‌లో మొత్తం 86 ఓట్లకుగాను.. 84 ఓట్లు
పోలవ్వగా.. టీబీజీకేఎస్‌కు 77 ఓట్లు రావడం గమనార్హం. ఇక ప్రత్యర్థులైన ఏఐటీయూసీకి 4, సీఐటీయూకు 2, బీఎంఎస్‌కు ఒక్క ఓటు దక్కాయి.
ఇల్లెందుతో బోణీ
సాయంత్రం ఏడు గంటలకు కౌంటింగ్ ప్రారంభమైన క్షణం నుంచే టీబీజీకేఎస్ హవా కొనసాగుతూ వచ్చింది. టీబీజీకేఎస్‌కు తొలి కానుక ఇల్లెందు డివిజన్ అందించింది. ఇక్కడ పోలైన మొత్తం 1095ఓట్లలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి 617 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ ఏఐటీయూసీకి 400 ఓట్లు వచ్చాయి. 217 ఓట్ల మెజార్టీతో(19.81శాతం) ఇక్కడ టీబీజీకేఎస్ ఘనవిజయం సాధించింది. మెజారిటీ కార్మికులు బాణం గుర్తుపై నమ్మకం ఉంచారని స్పష్టమయ్యింది.
కార్పొరేట్‌లోనూ పాగా
కొత్తగూడెంలోని కార్పొరేట్ కార్యాలయంలో మొదటిసారిగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం విజయకేతనం ఎగరేసింది. హైదరాబాద్‌లోని సింగరేణిభవన్‌లో పోలైన ఓట్లతో కలిపి ఇక్కడ మొత్తం 1475 ఓట్లకుగాను 1415 ఓట్లు పోలయ్యాయి. ఇందులో టీబీజీకేఎస్‌కు 866 ఓట్లు రాగా, ఏఐటీయూసీకి 322 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ టీబీజీకేఎస్ 544 ఓట్ల మెజార్టీతో గెలిచింది.
కొత్తగూడెంలో తిరుగులేని ఆధిక్యం
కొత్తగూడెం ఏరియాలో టీబీజీకేఎస్ మొదట్నుంచీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. మొత్తం పోలైన ఓట్లలో ఇంటి సంఘానికి 2011 ఓట్లు పోలవగా, ఏఐటీయూసీకి 1200 ఓట్లు లభించాయి. ఇక్కడ టీబీజీకేఎస్‌కు 811ఓట్ల మెజార్టీ లభించింది.
మణుగూరులో గులాబీ జెండా
మణుగూరు డివిజన్‌లో మొత్తం పోలైన ఓట్లలో టీబీజీకేఎస్ 1623ఓట్లను గెలుచుకుంది. ఏఐటీయూసీకి 992 ఓట్లు పోలయ్యాయి. ఈ డివిజన్‌లో టీబీజీకేఎస్ 631 ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించింది.
బెల్లంపల్లిలో హవా
బెల్లంపల్లి డివిజన్‌లో పోలైన మొత్తం ఓట్లలో టీబీజీకేఎస్ 862 ఓట్లు గెలుచుకోగా ఏఐటీయూసీకి 688 ఓట్లు వచ్చాయి. ఇక్కడ టీబీజీకేఎస్ 174 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది.
శ్రీరాంపూర్ టీబీజీకేఎస్‌దే
శ్రీరాంపూర్ డివిజన్‌లో ఇంటిసంఘం 2243 ఓట్ల భారీ మెజార్టీతో ఏఐటీయూసీపై ఘనవిజయం సాధించింది. ఇక్కడ పోలైన 11265 ఓట్లలో టీబీజీకేఎస్‌కు 6189 ఓట్లు రాగా, ఏఐటీయూసీకి 3916 ఓట్లు పోలయ్యాయి.
రామగుండంలో గెలుపు
రామగుండం 1వ డివిజన్‌లో టీజీబీకేఎస్ 2497 ఓట్లు సాధించి గెలుపొందింది. ఏఐటీయూసీకి 2151 ఓట్లు పోలయ్యాయి. రామగుండం రెండో డివిజన్‌లో టీబీజీకేఎస్ 1827 ఓట్లు గెలుచుకోగా, ఏఐటీయూసీకి 1061 ఓట్లు పోలయ్యాయి. టీబీజీకేఎస్ 895 ఓట్ల మెజార్టీతో గెలుపొందింది. ఇక 3వ డివిజన్‌లో 153 ఓట్ల మెజార్టీతో టీబీజీకేఎస్ గెలిచింది
- భూపాలపల్లిలో 6,854 ఓట్లకుగాను 6,415 ఓట్లు పోలయ్యాయి. ఏఐటీయూసీ 936 ఓట్ల మెజార్టీతో గెలుపొందింది.
- మందమర్రి ఏరియాలో ఏఐటీయూసీ 800 ఓట్ల మెజార్టీతో గెలిచింది.
కార్మికులకు రక్షకులుగా ఉంటాం: ఎంపీ సీతారాంనాయక్
సింగరేణి విజయాన్ని సీఎం కేసీఆర్‌కు బహుమతిగా ఇస్తున్నందుకు కార్మికులకు రక్షకులుగా ఉంటామని టీఆర్‌ఎస్ ఎంపీ సీతారాంనాయక్ అన్నారు. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం విజయం దిశగా దూసుకెళ్తుండటంపై ఆయన స్పందిస్తూ.. టీబీజీకేఎస్‌ను ఘన మెజార్టీతో గెలిపిస్తున్న బొగ్గు గని కార్మికులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు ఎన్నికల ప్రచార సందర్భంగా సింగరేణి కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామన్నారు.
పట్టంకట్టారు.. వాగ్ధానాలను నెరవేరుస్తాం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
సింగరేణిలో టీబీజీకేఎస్ విజయం సాధించడంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆనందం వ్యక్తం చేశారు. గురువారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుత.. సింగరేణి ఎన్నికల ఫలితాలు సీఎం కేసీఆర్ పరిపాలనా దక్షతకు నిదర్శనమన్నారు. ఓటేసిన సింగరేణి కార్మికులందరికీ ధన్యవాదాలని అన్నారు. కేసీఆర్ పాలనపై విశ్వాసంతోనే కార్మికులు టీబీజీకేఎస్‌కు పట్టంకట్టారని, ఇచ్చిన వాగ్ధానాలను నెరవేరుస్తామని మంత్రి హామీ ఇచ్చారు.