టీటీడీ ఛైర్మన్ గా పుట్టా సుధాకర్ యాదవ్ నియామకం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు సముఖంగా లేరా.. పుట్టాను కాకుండా వేరే వారిని నియమించాలని భావిస్తున్నారా.. అవుననే అనిపిస్తోంది. ఇద్దరు మంత్రుల వియ్యంకుడికి తొలుత టీటీడీ ఛైర్మన్ పదవి ఇవ్వాలనుకున్నారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష‌్ణుడికి వియ్యంకుడైన పుట్టా సుధాకర్ యాదవ్‌ను బ్రహ్మోత్సవాల చివరిరోజు టీటీడీ ఛైర్మన్ గా నియమించాలని భావించారు. మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి లీకు కూడా వచ్చింది. పుట్టా పురు ఖరారయినట్లేనని టీడీపీ వర్గాలు కూడా చెప్పాయి. మరోవైపు పుట్టా సుధాకర్ యాదవ్ కూడా తనను టీటీడీ ఛైర్మన్ పదవికి ఎంపిక చేయడం పట్ల కృతజ్ఞతలు కూడా తెలిపారు. పుట్టా అనుచరులు మైదుకూరు సంబరాలు కూడా జరుపుకున్నారు.
అయితే ఇన్ని రోజులైనా జీవో మాత్రం విడుదల కాలేదు. పుట్టా సుధాకర్ యాదవ్ నియామకంపై సీఎం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. పుట్టా ఛైర్మన్ గా నియమిస్తారని తెలియడంతోనే వివాదాలు చుట్టుముట్టాయి. పుట్టా గతంలో పాలకమండలి సభ్యుడిగా ఉన్నప్పుడు ఇతర మతాల కార్యక్రమాలకు హాజరైన విషయం ఆయన ప్రత్యర్థులు రచ్చ చేశారు. టీటీడీ అంటేనే హిందుత్వానికి ప్రతీకగా భావిస్తారు. టీటీడీలో హిందూయేతరులకు ఉద్యోగాలు కూడా ఇవ్వరు. శ్రీవారిని ఇతర మతాలు వారు దర్శించుకోవాలంటే డిక్లరేషన్ చేసి వెళ్లాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో పుట్టా పాలకమండలి సభ్యుడిగా ఉంటూ ఇతర మతాల కార్యక్రమాలకు హాజరు కావడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే పుట్టాను టీటీడీ ఛైర్మన్ గా ప్రకటించినప్పటికీ ఆయన మైదుకూరు నియోజకవర్గం టిక్కెట్ తనదేనని కార్యకర్తల సమావేశంలో చెప్పడాన్ని కూడా చంద్రబాబు కొంత సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి డీఎల్ చేరికపై కూడా ఇంకా క్లారిటీ రాలేదు. మొత్తం మీద పుట్టా సుధాకర్ యాదవ్ నియామకంపై జీవో విడుదల కాకపోవడంపై టీడీపీలో పెద్దయెత్తున చర్చ జరుగుతోంది.