జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గురువారం టీడీపీ మంత్రి పితాని పవన్ గురించి మాట్లాడుతూ ఏ జెండా, ఎజెండా లేని పవన్ గురించి ఆలోచించే తీరిక సమయం తనకు లేవని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే గతంలో కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటూ.. వారికి తానెవరో తెలియదు, సంతోషమని పవన్ పెట్టిన ట్వీట్ ఇప్పుడు టీడీపీలోనూ రాజకీయ వర్గాల్లోనూ సంచలనంగా మారింది. దీంతో పవన్ టీడీపీతో తెగతెంపులు చేసుకోవాలని నిర్ణయం తీసుకున్న తరువాతనే ఆ ట్వీట్ చేసుంటారని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఒక్క ట్వీట్ తో ఆయన తన వైఖరిని స్పష్టం చేశారని, తన బలాన్ని తక్కువగా అంచనా వేస్తున్నారంటూ హెచ్చరికలు జారీ చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ వ్యాఖ్యలు చేసుంటారని అంటున్నారు. 2014 ఎన్నికల్లో ప్రచారానికి తనను వాడుకుని, ఇప్పుడు తానెవరో తెలియదంటూ మంత్రులు చేసిన వ్యాఖ్యలపై ఎంత ఆగ్రహంగా ఉండకపోతే.. పేర్లను ప్రస్తావిస్తూ మరీ పవన్ వ్యంగ్యాస్త్రాన్ని వదులుతూ కామెంట్ చేసుంటాడని సర్వత్రా చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా ఇటీవల పవన్ ట్విట్టర్ నుండి జనసేన వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీకి దిగనుందని ట్వీట్ పెట్టి డిలీట్ చేసిన సంగతి తెలిసిందే. ట్వీట్ అయితే డిలీట్ చేసినా.. వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీకి సపోర్ట్ ఇవ్వదని తేలిపోయింది. దీంతో పవన్ పై చంద్రబాబు చిన్నచిన్నగా టీడీపీ తమ్ముళ్ళను ప్రయోగిస్తున్నారని.. స్వయంగా మంత్రులే పవన్ గురించి మాట్లాడుతుంటే.. అవి కాస్తంత గట్టిగానే తగిలాయని.. అందుకే ఆయనలా స్పందించాడని చెబుతున్నారు. ఇక పవన్ తాజా ట్వీట్ పై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో అని సర్వత్రా ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు.