బహుళజాతి సంస్థలతో పోటీపడే స్థాయికి భారత్ స్టార్టప్ సంస్థలు ఎదుగాలని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆకాంక్షించారు. గురువారం ఢిల్లీలో ఇండియా ఎకనామిక్ సమ్మిట్ స్కేల్ ఆఫ్ ఇండియా ఇంటరాక్టివ్ సెషన్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. స్టార్టప్ సంస్థలు సమస్యలను పరిష్కార కోణంలో చూడకుండా.. తమ ఉత్పత్తులను మరింత మెరుగ్గా తీర్చిదిద్దే స్థాయిలో పరిణతి సాధించాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం దేశంలో అతిపెద్ద టెక్నాలజీ ఇంక్యుబేటర్ టీ-హబ్‌ను ఏర్పాటు చేసిందని ఆయన చెప్పారు. దీనిద్వారా నవ యువ వ్యాపారవేత్తలకు మార్కెట్ చేసుకునే అవకాశాల్ని కల్పిస్తున్నదని వివరించారు. వారికి అవసరమయిన పెట్టుబడిని, మార్గదర్శకత్వాన్ని అందజేయడానికి తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని తెలిపారు. అంకుర సంస్థలు బాలారిష్టాలను అధిగమించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపించిందని వివరించారు. ఈ క్రమంలో వచ్చిందే ఆర్టీఏ మొబైల్ వ్యాలెట్ అని ఉదహరించారు.
రాష్ట్రంలో ఆర్టీఏ అధికారులు రూపొందించిన ఎం-వ్యాలెట్ అత్యంత ప్రజాదరణ పొందిందని, అతి తక్కువ సమయంలోనే అత్యధికంగా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ప్రజలు వినియోగించుకుంటున్నారని అన్నారు. వైవిధ్యమైన ఆలోచనలను వాస్తవిక దిశగా ముందుకు తీసుకెళ్లడమే కాకుండా.. అది ఒక వస్తువు రూపంలో బయటికి తీసుకొచ్చేందుకు టీహబ్ ప్రత్యేకపాత్ర పోషిస్తుందని అన్నారు. స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి నిధులు ఒక్కటే సరిపోవని, పెట్టుబడులకు అవసరమైన వాతావరణం, మౌలిక సదుపాయాలను ప్రభుత్వాలు సమకూర్చాల్సిఉందని కేటీఆర్ అన్నారు.
పారిశ్రామికవేత్తలతో భేటీ
తన ఢిల్లీ పర్యటనలో మంత్రి కే తారకరామారావు పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. గోద్రేజ్ గ్రూపు చైర్మన్ ఆదీ గోద్రేజ్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్, రెన్యూ పవర్ చైర్మన్, సీఈవో సుమంత్ సిన్హాలతో ఆయన సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ప్రస్తుతమున్న యూనిట్లను విస్తరించాల్సిందిగా కోరారు. యూఎస్‌ఐబీసీ సీనియర్ డైరెక్టర్లు జయ్ గుల్లీశ్, అభిషేక్ కిశోర్, లూలూ గ్రూపు ఇంటర్నేషనల్ చైర్మన్ యూసుఫ్ అలీ, అవాడా గ్రూప్ చైర్మన్ వినీత్ మిట్టల్, సాప్ హనా ఎంటర్‌ప్రైజ్ క్లౌడ్ ఎండీ దిలీప్‌కుమార్ ఖండేల్‌వాల్, వెల్‌స్పన్ ఇండియా సీఈవో దీపాలి గోయెంకా, మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ ఇండియా కంపెనీ ఎండీ ఖజునోరి కొనిషితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టీఎస్‌ఐపాస్ పారిశ్రామిక విధానాన్ని వీరికి వివరించినట్లు సమాచారం. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రాథమికంగా వారు అసక్తి కనపర్చినట్లుగా తెలిసింది. త్వరలో రాష్ట్రానికి ప్రతినిధి బృందాలను పంపించి, అధ్యయనం చేయించనున్నట్లుగా చెప్పినట్లుగా సమాచారం. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ వారిని పోచంపల్లి చేనేత శాలువాలు, రాష్ట్ర హస్త కళాకారులు తయారుచేసిన జ్ఞాపికలతో సత్కరించారు.