ఆదివాసీల ఆరాధ్య దైవం కుమ్రంభీం 77వ వర్ధంతిని శుక్రవారం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం జోడెఘాట్‌లో నిర్వహించేందుకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. స్మారక చిహ్నంలోని కుమ్రంభీం విగ్రహానికి రంగులు వేశారు. జల్.. జంగల్.. జమీన్ నినాదాలకు గుర్తుగా నిర్మించిన మూడు ద్వారాలను ముస్తాబు చేశారు. అధికారికంగా నిర్వహిస్తున్న భీం వర్ధంతికి వేలాది సంఖ్యలో ఆది వాసీలు తరలిరానుండగా, అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. వేర్వేరుగా భోజనం, తాగునీటి వసతిని కల్పిస్తున్నారు. ఎమ్మెల్యేలతోపాటు జిల్లా మంత్రు లు, ఆసిఫాబాద్ కలెక్టర్ చంపాలాల్, ఐటీడీఏ ఇంచార్జి పీవో, మంచిర్యాల కలెక్టర్ ఆర్వీ కర్ణన్ హాజరు కానున్నారు. ఆదిలాబాద్, ఉట్నూర్, ఆసిఫాబాద్, మంచిర్యాల డిపోల నుంచి దాదాపు 20 వరకు ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నారు. స్మాకర చిహ్నానికి సమీపంలోనే భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
