తెలంగాణలో దారుణం జరిగింది. ప్రేమ పెళ్లి చేసుకున్నారనే ఒకే ఒక్క కారణంతో ఆ కొత్త జంటను యువతి తరపు బంధువులే రాక్షసంగా హత్య చేశారు. పెంచి పెద్ద చేశామన్న తమ ప్రేమను కూడా మర్చిపోయి ఆ కొత్త జంట ప్రాణం తీసి హంతకులయ్యారు. పెళ్లిన నాలుగు నెలలకే అత్యంత దారుణంగా గొంతుకోసి హత్య చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలంలోని బాల్‌రాజుపల్లికి చెందిన నేదూరి హరీశ్(22) గ్రామంలో ఆటో నడుపుకుంటున్నాడు. నేదూరి రచన(21) తల్లిదండ్రులు గతంలోనే మృతిచెందారు. దీంతో రచన మేనమామల ఇంటి వద్ద ఉంటూ డిగ్రీ వరకు చదువుకుంది. ప్రేమ చిగురించిందిలా.. హరీశ్ ఇంటికి ఎదురుగానే రచన మేనమామల ఇల్లు ఉంది. అంతేగాక, ఈ రెండు కుటుంబాల మధ్య బంధుత్వం కూడా ఉండటంతో హరీశ్, రచనల మధ్య నాలుగేళ్ల నుంచి ప్రేమ వ్యవహారం సాగింది. ఈ క్రమంలోనే నాలుగు నెలల క్రితం హరీశ్, రచన బంధువులకు చెప్పకుండా పెళ్లి చేసుకొన్నారు. కొద్దిరోజులు పాటు మారుపాకలోని బంధువుల ఇంట్లో ఉన్నారు. ఇటీవల బాల్‌రాజుపల్లికి వచ్చారు. గతంలోనే ప్రేమ వ్యవహారం బయటపడినపుడు ఈ జంట పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు వీరి బంధువుల్ని పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.
అయినా ప్రేమ పెళ్లి చేసుకోవడం జీర్ణించుకోలేని రచన బంధువులు గురువారం సాయంత్రం వీరు ఇంట్లో ఉండగా కిరాతకంగా ఇద్దరి గొంతులు కోసి హత్యచేశారు. రక్తపు మడుగులోనే ఇద్దరూ ప్రాణాలు విడిచారు. అనంతరం నిందితులు అక్కడ్నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న వేములవాడ పట్టణ, గ్రామీణ సీఐలు శ్రీనివాస్, మాధవి, ఎస్‌ఐలు రాజశేఖర్, సైదారావులు ఘటన స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపారు. కాగా, నిందితులను అశోక్, చింటు, శేఖర్‌గా గుర్తించినట్లు సమాచారం.