ఓ మహిళ తనపై లైంగిక దాడి జరిగిందని ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో నిందితుడి చెవితో సీనియర్ ఎస్పీ కార్యాలయానికి చేరుకుంది. ఆయన లేకపోవడంతో ఎస్పీకి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించి బోరుమంది. ప్రత్యక్ష సాక్ష్యాన్ని ఆమె తీసుకురావడంతో ఆయన వెంటనే కేసు నమోదుకు ఆదేశించారు. తొలుత ఆమె ఫిర్యాదు నమోదు చేయని పోలీసులను గట్టి హెచ్చరికలు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని గోండా అనే ప్రాంతంలోని ఓ మహిళ సోమవారం తన పిల్లలతో కలిసి ఇంట్లో నిద్రిస్తుంది. ఇంటి బయట ఉన్న గదిలో ఆమె భర్త నిద్రిస్తున్నాడు. ఆ సమయంలోనే వారింట్లోకి పొరుగిళ్లకు చెందిన నలుగురు వ్యక్తులు చొరబడ్డారు. ఆ వెంటనే ఆమెపై లైంగికదాడికి దిగారు.
ఆ క్రమంలో బాధితురాలు భయంతో గట్టిగా కేకలు వేయడంతో భార్యను కాపాడేందుకు భర్త లోపలికి వచ్చాడు. దీంతో, మిగితా ముగ్గురు అతడిపై తీవ్రంగా దాడి చేస్తుండగా తనపై లైంగిక దాడికి పాల్పడుతున్న వ్యక్తి చెవిని బాధితురాలు కొరికిపారేసింది. ఆ తర్వాత వారు జరిగిన విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించి వెళ్లిపోయారు. ఈ మేరకు వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా రెండు రోజులపాటు స్థానిక పోలీసులు కేసు నమోదుచేసుకోలేదు. దీంతో బాధితురాలు ఏం చేయాలో పాలుపోక.. నిందితుడి చెవిని కొరికిన విషయం గుర్తుకుతెచ్చుకొని ఆ భాగాన్ని తీసుకొని నేరుగా ఎస్పీ కార్యాలయానికి చేరింది. ఇదిలా ఉండగా, బాధితురాలి భర్త తమపై దాడికి పాల్పడ్డాడంటూ లైంగిక దాడి చేసినవారు కేసులు పెట్టడం గమనార్హం.