ఆళ్లగడ్డలో ఘోరం జరిగింది. పెద్దలను ఎదురించలేక ప్రియుడిని పెళ్లి చేసుకోవాలని కలలు కన్న ప్రియురాలు కానరానిలోకాలకు వెళ్లింది. ఇదంతా ఎక్కడో కాదు ప్రియుడితో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘోరం జరిగింది. ప్రియుడిని పెళ్లి చేసుకోవాలని హైదరాబాద్‌కు వెళుతున్న ఆమెను రోడ్డు ప్రమాదంలో మృత్యువు కబలించింది. తమను ఎవరైనా అడ్డగిస్తారేమోననే భయంతో కారును వేగంగా నడుపుతున్నారు. ఆ వేగమే ఆమెతో పాటు మరొకరిని బలిగొంది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల దగ్గర ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న వృద్ధుడిని కారు ఢీకొంది. వృద్ధుడిని కారు ముళ్ల పొదల్లోకి ఈడ్చుకెళ్లింది. వృద్ధుడితోపాటు కారులోని యువతి నాగలక్ష్మి మృతి చెందింది. పెద్దలకు తెలియకుండా ప్రేమ పెళ్లి చేసుకోవాలని యువతిని ప్రియుడు స్నేహితుల సహాయంతో హైదరాబాద్ తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది. నాగలక్ష్మికి ఆమె తల్లిదండ్రులు మరొక యవకుడితో ఇవాళ పెళ్లిచూపులకు సిద్ధం చేశారు. ప్రియుడు విశ్వనాథ్‌రెడ్డి దివ్యాంగుడు. అయినా నాగలక్ష్మి తాను మనసిచ్చిన వ్యక్తితోనే తన జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకుంది. పెద్దలను నిర్ణయాన్ని కాదని ప్రియుడితో వెళుతూ కన్నుమూసింది.
