తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన జరుగుతున్న తోలి సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు సర్వం సిద్ధమైంది .సింగరేణి సంస్థ ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు మొత్తం ఆరు సార్లు గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగాయి .మొదటిగా సరిగ్గా పంతొమ్మిది యేండ్ల కిందట అంటే సెప్టెంబర్ 9న 1998లో మొదటి సింగరేణి గుర్తింపు కార్మిక ఎన్నిక జరిగింది. దీని తర్వాత వరసగా2001 ఫిబ్రవరి 19న రెండోసారి, 2003 మే 14న మూడోసారి, 2007 ఆగస్టు 9న నాలుగో సారి, 2012 జూన్ 28న ఐదోసారి కార్మిక సంఘం ఎన్నికలు జరిగాయి.
ఈ రోజు గురువారం జరగనున్న ఈ కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికల్లో రాష్ట్ర అధికార టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన అనుబంధ టీబీజీకేఎస్, ప్రతిపక్ష పార్టీలకు చెందిన సీపీఐ, కాంగ్రెస్‌ల అనుబంధ కార్మిక సంఘాలు ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీల కూటమలు బరిలోకి దిగుతున్నాయి .అయితే తెలంగాణ టీడీపీ అనుబంధ కార్మిక సంఘం టీఎన్‌టీయూసీ మాత్రం ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీల కూటమికి మద్దతిస్తోంది.
రహస్య బ్యాలెట్ విధానం ద్వారా జరగనున్న ఈ ఎన్నికల్లో 52,534 మంది సింగరేణి కార్మికులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కేంద్ర కార్మిక శాఖ గుర్తించిన కంపెనీలోని 11 ఏరియాల పరిధిలో 92 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి.ఉదయం 7 గంటల నుంచి సాయం త్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ప్రతి ఓటరు/ఉద్యోగి తప్పనిసరిగా తమ గుర్తింపు కార్డు (శాశ్వత/తాత్కాలిక)ను వెంటతీసుకొని రావాలని యాజమాన్యం కోరింది. రాష్ట్రంలో మొత్తం ఆరు జిల్లాల పరిధిలో జరగనున్న ఈ ఎన్నికల నిర్వహణకు పోలీస్, కౌంటింగ్ సిబ్బంది, రెవెన్యూ, ఇతర శాఖల సిబ్బందిని నియమించారు.