మునుగోడు నియోజకవర్గ ప్రజల కష్టాలు తీరాలంటే, ఫ్లోరైడ్ బాధలు పోవాలంటే కృష్ణా నీళ్లు రావాలని ఇరిగేషన్ శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. నల్గొండ జిల్లా మునుగోడులో కొత్తగా నిర్మించిన గోదాములను ప్రారంభించిన తర్వాత ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. డిండి ఎత్తిపోతల పథకం చేద్దామంటే కాంగ్రెస్ వాళ్ళు కోర్టులో కేసులు పెడుతున్నారని, శివన్నగూడెం ప్రాజెక్ట్ వద్ద టెంట్లు వేయించి ధర్నాలు చేయిస్తున్నారని మంత్రి గుర్తుచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం జల యజ్ఞం పేరిట ప్రారంభించిన ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయలేదని హరీశ్ రావు విమర్శించారు. తెలంగాణ వచ్చిన తర్వాత పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో భూమి కోల్పోయిన రైతులకు తల వంచి నమస్కరిస్తున్నాని చెప్పారు. భూ నిర్వాసితులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ నేతలు రైతు సమితులను అడ్డుకొని రైతుల నోట్లో మట్టి పోయొద్దని హితవు పలికారు. రాష్ట్రంలో గొల్ల కురుమలకు గొర్లను ఇచ్చింది చూసి కర్ణాటక మంత్రి రేవన్ అభినందించారని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు.