సౌర విద్యుదుత్పత్తితో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానానికి చేరింది. ఈ విద్యుదుత్పత్తి గణనీయంగా పెరగడంతో తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు తేరుకున్నాయి. ప్రస్తుతం రోజూ గరిష్ఠంగా 2,357 మెగావాట్ల మరో 4 నెలల్లో అదనంగా వెయ్యి మెగావాట్లు పెరిగి జనవరికల్లా 3400 మెగావాట్ల సౌరవిద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు.
సేద్యానికి నిరంతరాయ సరఫరాతో…
గతనెలలో రాష్ట్రంలో రోజువారీ విద్యుత్తు వినియోగం అత్యధికంగా 9 వేల మెగావాట్లకు చేరడంతో భారీగా ‘భారత ఇంధన ఎక్స్ఛేంజి’(ఐఈఈ)లో కొనాల్సి వస్తోంది. గత జులై చివరివారం నుంచి మెదక్, నల్గొండ, కరీంనగర్ పాత జిల్లాల పరిధిలో సేద్యానికి 24 గంటలూ విద్యుత్తు సరఫరా చేస్తున్నారు. 2016 సెప్టెంబరు 25న తెలంగాణలో అన్ని వర్గాల కనెక్షన్లకూ కలిపి 5,243 మెగావాట్లు విద్యుత్తు వాడుకోగా ఈఏడాది అదేరోజున 9,109 మెగావాట్లు వినియోగించారు. వ్యవసాయ బోర్లకు 24 గంటల వాడుతున్నందునే ఈ పెరుగుదల వచ్చిందని ట్రాన్స్‌కో సీఎం కేసీఆర్‌కు నివేదించింది. కొంతమేర సౌరవిద్యుత్ ఆదుకున్నా వ్యవసాయ డిమాండు కారణంగా రోజూ అదనంగా రూ.10 కోట్ల వరకూ ఐఈఈలో చెల్లించి కొనాల్సి వస్తున్నట్లు ట్రాన్స్‌కో వెల్లడించింది. గత నెల 25కు ముందు వరుసగా 57 రోజుల పాటు రూ.570 కోట్లను అదనపు కరెంటు కోసం ఐఈఈకి చెల్లించింది. గత కొద్ది రోజుల నుంచి శ్రీశైలం విద్యుత్కేంద్రంలో జల విద్యుదుత్పత్తి పెంచుతూ వస్తున్నారు. సెప్టెంబరు ఒకటిన జల విద్యుత్ కేవలం 1 మిలియన్ యూనిట్లు(ఎంయూ) రాగా అదే నెల 28న 25.3 ఎంయూలకు పెరిగింది. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చి ఇప్పుడు 4 ఎంయూలకే పరిమితమైంది.
థర్మల్ విద్యుత్కేంద్రాలకు కొత్త సమస్యలు పెరుగుతున్నాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకే సౌరవిద్యుత్ ఉత్పత్తి ఉంటోంది. ఆ సమయంలో వాటి నుంచి వచ్చే విద్యుత్‌ను తీసుకోవడానికి థర్మల్ కేంద్రాల్లో ఉత్పత్తి తగ్గించాల్సి వస్తోందని, రాత్రిపూట వాటిలో పెంచాల్సి వస్తోందని జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు ‘ఈనాడు’కు చెప్పారు. థర్మల్ కేంద్రాల్లో సగటున 40 శాతం వరకూ ఉత్పత్తి చేయలేకపోతున్నామన్నారు. ఉదయం 7 నుంచి 12 గంటల వరకే రాష్ట్రంలో ఏడు నుంచి 9 వేల మెగావాట్ల డిమాండు వస్తోంది. తిరిగి సాయంత్రానికి ఆరేడు వేలకు పడిపోతోంది. ఉదయం రైతులంతా ఒకేసారి మోటార్లు ఆన్‌చేయడం వల్ల అత్యధిక డిమాండు ప్రకారం సరఫరా చేయడానికి విద్యుత్ గ్రిడ్ నిర్వహణకు ట్రాన్స్‌కో ప్రయత్నిస్తున్నది.