ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిసర గ్రామాల్లో ఇప్పుడు గాడిద పాలకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో లీటర్ గాడిద పాలను రూ.1000లకు విక్రయిస్తున్నారు.
తెలంగాణలోని మంచిర్యాల జిల్లాకు చెందిన వడ్డీరాజుల కులస్తులు అమరావతి పరిసర గ్రామాల్లో తిరుగుతూ 50 మిల్లీలీటర్ల గాడిద పాలను రూ.50కు అమ్ముతున్నారు. గాడిదలను తమవెంట తీసుకెళ్లి అక్కడే పాలు పితికి ఇస్తున్నారు. సుమారు 40 పాడి గాడిదలను అమరావతి శివారులో ఉంచి ఉదయాన్నే వాటిని తీసుకుని గ్రామాల్లో పర్యటిస్తున్నారు.
అయితే వీరు గతంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల పర్యటించి గాడిద పాలను విక్రయించారు. ఇవి తాగితే ఉబ్బసం, ఆయాసం, నడుంనొప్పి, కడుపునొప్పి తదితర రోగాలు నయమవుతాయని వారు చెబుతున్నారు. వాస్తవానికి ఇది కొత్త విషయమేమీ కాదు. దేశంలోని చాలా రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రజలు గాడిద పాలను తీసుకుంటున్నారు. ప్రాంతాన్ని బట్టి వీటి ధరల్లోనూ మార్పులు ఉన్నాయి.