ఏపీలో వైసీపీ తలపెట్టిన కార్యక్రమం వైఎస్సార్ కుటుంబంలో సభ్యత్వాలు జోరుగా జరుగుతున్నాయి. ఇప్పటికే సభ్యత్వాలు 80 లక్షలకు దాటినట్లు ఆ పార్టీ నేతలు ప్రకటించారు. అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకత వల్లనే తమ పార్టీకి సభ్యత్వాల సంఖ్య పెరుగుతోందని, ఎవరికి వారు తమంతట తామే పార్టీ సభ్యత్వం తీసుకోవడానికి ముందుకు రావడం శుభపరిణామమని వైసీపీ నేతలు చెబుతున్నారు. గత నెల 11వ తేదీన వైఎస్సార్ కుటుంబం కార్యక్రమం ప్రారంభమైంది. కేవలం 25 రోజుల్లోనే 80 లక్షల మంది పార్టీ సభ్యత్వం తీసుకోవడం అంటే సాధారణ విషయమేమీ కాదని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి అక్టోబర్ 2వ తేదీతోనే నవరత్నాల సభలను, వైఎస్సార్ కుటుంబ కార్యక్రమాన్ని ముగించాల్సి ఉంది. అయితే సభ్యత్వంపై దృష్టి పెట్టడంతో కొన్ని నియోజకవర్గాల్లో నవరత్నాల సభలను నేతలు నిర్వహించలేదు. కొన్ని చోట్ల గ్రూపు తగాదాల వల్ల కూడా సభలు జరగలేదు. కాని వైసీపీ అధినేత జగన్ మాత్రం నవరత్నాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.