ప్రపంచంలో తరచుగా ఆర్థిక మాంద్యానికి గురయ్యే దేశాలలో జింబాబ్వే ముందు వరుసలో ఉంటుంది. అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే పాలనలో మరోసారి జింబాబ్వే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రజల కనీస అవసరాలకు కూడా సరుకులు దొరకని దుస్థితిలో జింబాబ్వే కొట్టుమిట్టాడుతుంది. ఈ నేపథ్యంలో అధికార జింబాబ్వే ఆఫ్రికన్ నేషనల్ యూనియన్ – పేట్రియాక్ ఫ్రంట్(జును-పీఎఫ్) పార్టీ.. దేశంలోని ఉన్నతవర్గాల నుంచి పాతదుస్తులను సేకరించే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందుకాను ముగాబే సతీమడి దేశ ప్రథమ పౌరురాలు, గ్రేస్ ముగాబే సైతం తన వంతు సాయంగా పాత దుస్తులను దానం చేశారు. అయితే, గ్రేస్ ఇచ్చిన దుస్తుల్లో ఆమె వాడిన లోదుస్తులు కూడా ఉన్నాయని, ఆ చర్య ద్వారా ఆమె పేదలను తీవ్రంగా అవమానించారని కెన్నెత్ న్యాంగాని అనే జర్నలిస్టు ఓ కథనం రాశారు. అయితే కెన్నెత్ రాసినదాంట్లో ఏమాత్రం వాస్తవం లేదని, అధికార పార్టీపై దుష్ప్రచారం చేసేందుకే ఆ కథనాన్ని అల్లారని అధికారులు గుర్తించారు. ఈ మేరకు కెన్నెత్ పై కేసు నమోదుచేసి, అరెస్టు చేసినట్లు జింబాబ్వే మానవ హక్కుల సంఘం ప్రపంచ మీడియాకు వెల్లడించింది. త్వరలోనే ఈ కేసు కోర్టు విచారణకు వస్తుందని అధికారులు చెప్పారు. కాగా, జర్నలిస్టు కెన్నెత్ అరెస్టును అంతర్జాతీయ మానవహక్కుల వేదిక ఆమ్నెస్టీ ఖండించింది. జింబాబ్వే పాలకులు మీడియాను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, కెన్నెత్‌ను తక్షణమే విడుదల చేయాలని కోరింది. దానితోపాటు మీడియా కూడా హద్దులు మీరుకుండా స్వీయ నియంత్రణతో పనిచేయాలని ఆమ్నేస్టీ సూచించింది. మరి అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే తన భార్య లోదుస్తులపై కథనాలు రాసిన ఆ జర్నలిస్టును క్షమించి వదిలేస్తాడా లేక..కఠినంగా శిక్షిస్తాడో చూడాలి మరి. అసలే అల్లకల్లోలంగా ఉన్న జింబాబ్వే ఫస్ట్ లేడీ లోదుస్తుల ఘటనతో అంతర్జాతీయంగా పరువు పోగొట్టుకున్నట్లయింది.