ఏపీ వంటి బలమైన ప్రతిపక్షం ఉన్న రాష్ట్రంలో అధికార పార్టీకి ఎప్పుడూ టెన్షనే. దీంతో ప్రతిపక్షం ఏం చేస్తోంది.. ఎలాంటి వ్యూహంతో ముందుకు వస్తోంది.. అధికార పార్టీని ఎలాంటి ఇబ్బందులు పెట్టబోతోంది.. వంటి కీలక విషయంపై దృష్టి సారించడాన్ని ఎవరూ తప్పుపట్టరు. అయితే మిత్రపక్షంగా ఉన్న జనసేన విషయంలోనూ ఏపీ సీఎం చంద్రబాబు తన వైఖరిని మార్చుకోకపోవడంపై రకరకాల సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. జనసేన పార్టీ అధినేత పవన్ ఎప్పుడు ఎలాంటి ట్వీట్ చేసినా.. బాబు తప్పకుండా స్వయంగా చదువుతారని సమాచారం. అంతేకాదు దానిపై ఎలాంటి కౌంటర్ ఇస్తారోనని ముందే టీడీపీ నేతలను అలెర్ట్ కూడా చేస్తుంటారు. ఇక ఇప్పుడు తాజాగా 2019 ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో పవన్ పార్టీపై చంద్రబాబు పూర్తిగా నిఘా పెట్టారని సమాచారం.
నిజానికి పూర్తిగా ఎలాంటి కేడర్ లేని పార్టీ, ఎలాంటి సిద్ధాంతాన్నీ ప్రకటించని ఓ పార్టీపై బాబు ఇంతగా నిఘా పెట్టడం.. ఇంతగా ఆలోచించడం వంటి కీలక అంశాలు ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. రెండు రోజుల కిందట జనసేన ట్విట్టర్‌లో తాము 2019 ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తామో.. ఎక్కడెక్కడ పోటీ చేస్తామో చెప్పుకొచ్చారు. ఇది ఒకరకంగా తీవ్ర సంచలనం సృష్టించింది. అయితే, ఇంతలోనే ఈ ట్వీట్‌ను తొలగించేశారు. ఈ క్రమంలోనే అసలు ఏమై ఉంటుందని అందరూ అనుకున్నారు. ట్వీట్ పెట్టడం వెనుక ఎవరున్నారనేది తెలియదు కానీ, ట్వీట్‌ను తీసేయడం వెనుక మాత్రం టీడీపీ అధినేత ఉన్నారన్న చర్చలు నడుస్తున్నాయి. ఇప్పుడే ఇలా సీట్ల పంపకాలు అంటూ విషయం మొదలు పెడితే.. తన పార్టీ గల్లంతేనని.. చాలామంది నేతలు జంప్ అవుతారని.. దీంతో బాబుకు భయంపట్టుకుందని ఏపీ రాజకీయ వర్గీయుల్లో చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన మంత్రి గంటా శ్రీనివాసరావు సాయంతో ఈ ట్వీట్ తొలగించే కార్యక్రమం చూశారనే టాక్ కూడా వినిపిస్తోంది. అయితే మొత్తానికి పవన్ పార్టీతో తనకు ఎప్పటికైనా డేంజర్ అని చంద్రబాబు భావిస్తున్నారని సర్వత్రా చర్చించుకుంటున్నారు.