విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌లో చినుకురాలితే చిత్తడి అవుతుంది..భారీ వర్షాలు వస్తే భాగ్యనగరం కాస్తా సాగరంగా మారుతుంది.. రోడ్లన్నీ చెరువుల్లా మారుతున్నాయి. వర్షాలు, వరదలు రాగానే జీహెచ్‌ఎంసీ అధికారులు కండితుడుపు చర్యలు చేపడుతున్నా..శాశ్వత పరిష్కారం దిశగా ప్రయత్నించడంలో అలసత్వం వహిస్తున్నారు. వాస్తవానికి హైదరాబాద్‌లో రోడ్లు దారుణంగా ఉన్నాయి. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పుడు హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులను అప్రమత్తం చేస్తున్నా అధికారులు మాత్రం మొద్దు నిద్ర పోతున్నారు. ఒక్కసారి శ్రీనగర్ కాలనీ, యూసుఫ్ గూడ తదితర ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి ఇంకా అధ్వాన్నంగానే ఉంది. అలా రోడ్లు వేయడం వెంటనే వాటర్ వర్క్ వాళ్లు, విద్యుత్ శాఖ వాళ్లు రోడ్లను తవ్వి గుంతలు తీయడం..అవి పూడ్చి మళ్లీ రోడ్లు వేయకుండా అలానే వదిలివేయడం వల్ల సమస్య మరింత జటిలం అవుతుంది..ఒక్క ప్రణాళిక ప్రకారం పనులు నిర్వహిస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదురవవు. కానీ మున్సిపల్ , వాటర్ బోర్డ్, టెలికాం
శాఖలు సమన్వయంతో వ్యవహరిస్తే రోడ్లు ఇంత అధ్వాన్నంగా తయారవవు. ఆయా శాఖలతో సమన్వయం చేయాల్సిన మున్సిపల్ శాఖ అధికారులు బాధ్యతారాహిత్యమే దీనికి కారణం. స్వయంగా మంత్రి కేటీఆర్ శ్రీనగర్ కాలనీ, కృష్ణానగర్, ఇందిరానగర్, మధురానగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి రోడ్ల అధ్వాన్న పరిస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేసినా అధికారుల్లో చలనం లేదంటే వారిలో అలసత్వం, నిర్లక్ష్యం ఎంతగా పేరుకుపోయాయో అర్థమవుతుంది. కేటీఆర్ ఎన్ని సమీక్షలు చేసి హెచ్చరించినా అధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదు..దీనికి కారణం దశాబ్దాలుగా ఉమ్మడి రాష్ట్రంలో మున్సిపల్ అధికారుల్లో పేరుకున్న అవినీతి. ఉమ్మడి రాష్ట్రంలో జీహెచ్‌ఎంసీ అవినీతికి పరాకాష్టగా ఉండేది. చేయి తడపనిదే ఏ పని జరిగేది కాదు..పరిశ్రమలకు అనుమతులు, ఎల్‌ఆర్ఎస్‌లు, బిల్డింగ్ పర్మిషన్లు ఇలా ప్రతి దాంట్లో లక్షలకు లక్షలు లంచాలు మెక్కుతూ వాటాలు పంచుకునే వారు.
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి కొద్ది మేర తగ్గింది. కేటీఆర్ అవినీతిరహితంగా ఉండేందుకుగాను జీహెచ్‌ఎంసీలో అన్ని విభాగాలను ఆన్‌లైన్‌లో పారదర్శకంగా మార్చివేశారు.దీంతో అక్రమార్కులైన కొంత మంది అధికారులకు చెక్ పడింది. దీనికి తోడు జీహెచ్‌ఎంసీలో అవినీతిని ఉపేక్షించేది లేదని కేటీఆర్ హెచ్చరించారు.దీంతో అక్రమ సంపాదనలకు అలవాటైన అధికారులు, ఇతర సిబ్బంది కేటీఆర్‌పై కినుక వహించారు.. అందుకే కేటీఆర్ ఆదేశించినా త్వరతిగతిన పూర్తి చేయకుండా తాపీగా వ్యవహరిస్తున్నారంట..తమకు పైరాబడి ఉంటేనే ఉత్సాహంగా పని చేస్తాం..ఇప్పుడు ఆ పై రాబడి దాదాపుగా తగ్గిపోయింది..అప్పటికీ వారిని, వీరిని బెదిరించి, భయపెట్టి వసూలు చేసుకుంటున్నా..చిల్లర ఖర్చులకు కూడా రావడం లేదు..ఇది వరకు జీతం ఖాతాలోనే ఉండిపోయేది..పై సంపాదనతోనే అన్ని ఖర్చులు వెళ్లదీశాం..జీతంతో సంబంధం లేకుండా జీవితం వెళ్లిపోయేది..ఇప్పుడు జీతం ఇంట్లో పైఖర్చులకు కూడా సరిపోవడం లేదని ఓ మున్పిపల్ అధికారి వాపోయాడంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. అందుకే కేవలం జీతంతో బతికేదానికి పని చేస్తే ఏంటీ..పని చేయకపోతే ఏంది..మన జీతం మనకు వస్తుందనే భావనతో మున్సిపల్ అధికారులు, సిబ్బంది విధులలో అలసత్వం వహిస్తున్నారని తెలుస్తోంది..ఇది మున్పిపల్ అధికారుల బాధ్యతారాహిత్యాన్ని తెలియజేస్తుంది. అందుకే కేటీఆర్ ఎంతగా ప్రయత్నించినా గ్రేటర హైదరాబాద్ పరిస్థితి ఏం మాత్రం మారడం లేదు. అయ్యా మున్సిపల్ అధికారుల్లారా ఇప్పటికైనా మారండి..మీ నిజాయితీని శంకించడం లేదు..కొంతమంది తీరు వల్ల మొత్తం మున్సిపల్ శాఖ బద్నాం అవుతోంది. కాబట్టి మరింతగా విధులపై ఫోకస్ పెట్టి , ఒళ్లు వంచి పని చేయండి.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మీ చేతిలోనే ఉందని గుర్తు పెట్టుకోండి.