ఏపీలో ఇటీవల నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికల ఫలితాలు ,కాకినాడ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తర్వాత అనంతపురం జిల్లాలో వైసీపీకి పెద్ద షాకే ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం తన రాజకీయ భవిష్యత్‌పై ఆందోళనతో.. టీడీపీ చేపట్టిన ‘ఆపరేషన్ ఆకర్ష్’తో కొందరు సీనియర్ నేతలు ఆ పార్టీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ ముఖ్య నేత, అనంతపురం మాజీ ఎమ్మెల్యే బోడిమల్లు గుర్నాథరెడ్డి తెలుగుదేశం తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది.
తన అనుచరులు, కార్యకర్తలతో సమావేశమై తన నిర్ణయాన్ని చెప్పినట్లు సమాచారం. కొంతకాలంగా ఆయన టీడీపీలో చేరతారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఆయన ఆ పార్టీకి చెందిన ఒక ప్రముఖ నేతతో మంతనాలు సాగించినట్లు విశ్వసనీయ సమాచారం.అయితే తను ఈ వ్యాఖ్యలను ఖండించాడు అని కూడా మీడియాలో వచ్చింది .ఒకవేళ అనంతపురం నియోజకవర్గంలో వైసీపీకి ప్రధాన నాయకుడిగా ఉంటున్న గుర్నాథరెడ్డి టీడీపీలో చేరితే రాజకీయ చరిత్ర కలిగిన వారి కుటుంబం మొత్తం పార్టీ మారే అవకాశాలున్నాయని
రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
గత కొంతకాలంగా గుర్నాథరెడ్డి కొందరు టీడీపీ నేతలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు అని ప్రచారం జరుగుతుంది . మాజీ మంత్రి పరిటాల రవీంద్ర కుటుంబంతో ఆయన కుటుంబంతో పాటుగా అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి కుటుంబంతో కూడా గుర్నాథరెడ్డి కుటుంబానికి సత్సంబంధాలున్నాయి.దీంతో ఆయన వైసీపీ ను వీడి టీడీపీలో చేరితే వచ్చే ఎన్నికల్లో అధికారం కోసం తీవ్రంగా శ్రమిస్తున్న వైసీపీ పార్టీకి తీరని లోటు అని ఆ పార్టీ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తోన్నాయి .