తెలంగాణ రాష్ట్ర౦లో నిరుద్యోగులకి ప్రభుత్వం తీపి కబురు అందించనుంది . వైద్యారోగ్యశాఖలో వైద్యులు, సిబ్బంది కొరతను తీర్చేందుకు కాంట్రాక్టు పద్ధతిలో 2100 పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టినట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి సీ లకా్ష్మరెడ్డి చెప్పారు. రెండువేల పర్మినెంట్ పోస్టుల భర్తీ బాధ్యతను టీఎస్‌పీఎస్సీకి అప్పగించామని, సాంకేతిక, పాలనాపరమైన సమస్యల కారణంగా ఆ పోస్టుల భర్తీకి సమయం పట్టే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 2100 పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయనున్నట్టు మంగళవారం సచివాలయంలో వైద్యశాఖ అధికారుల సమీక్షలో తెలిపారు. వైద్యవిద్య, వైద్య విధానపరిషత్, వైద్య సంచాలకుల పరిధిలో పోస్టులను భర్తీచేయాలని ఆదేశించారు. బీబీనగర్ నిమ్స్‌లో ఓపీ సేవలు ప్రారంభించి చాలా రోజులైందని, మిగతా పనులను వేగంగా పూర్తిచేసి త్వరలో ఐపీ సేవలు ప్రారంభించేలా చూడాలని ఆదేశించారు.
రాష్ట్రంలో వర్షాల కారణంగా అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం పొంచి ఉన్నదని, వైద్యసేవలు అందించడంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాజధానిలో ఏర్పాటుచేయనున్న వీఎం హోం, ఎల్బీనగర్ దవాఖానల పురోగతి, ఈహెచ్‌ఎస్, జేహెచ్‌ఎస్ పథకం అమలు, విస్తరణ అంశాలపై చర్చించారు. ప్రభుత్వం అనుమతించిన వెల్‌నెస్ కేంద్రాలను త్వరలో ప్రారంభించాలని సూచించారు. కేసీఆర్ కిట్ల పథకానికి ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా కొత్తగా మాతా శిశు వైద్యశాలలను ఏర్పాటుచేసేందుకు అనువైన దవాఖానలను ఎంపిక చేయాలన్నారు. గ్రామాల్లో బీపీ, షుగర్ వ్యాధిగ్రస్థులను గుర్తించి ఔషధాలు ఇచ్చేస్థాయిలో ఆశ వర్కర్లకు శిక్షణ ఇవ్వాలని అధికారులను మంత్రి లకా్ష్మరెడ్డి ఆదేశించారు. సమీక్షలో వైద్యారోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజేశ్వర్ తివారీ, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వాకాటి కరుణ, నిమ్స్ డైరెక్టర్, ఆరోగ్యశ్రీ సీఈవో మనోహర్, కేసీఆర్ కిట్ల పథకం సీఈవో సత్యనారాయణరెడ్డి, టీఎస్‌ఎమ్మెస్‌ఐడీసీ ఎండీ వేణుగోపాల్, సీఈ లక్ష్మణ్‌రెడ్డి, ఈహెచ్‌ఎస్, జేహెచ్‌ఎస్ పథకం సీఈవో కే పద్మ తదితరులు పాల్గొన్నారు.