మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి టీడీపీలో చేరేందుకు సిద్ధమయినా వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీలోకి వెళితే తనకు నియోజకవర్గంలో పాటు, జిల్లాలోకూడా ప్రాముఖ్యత ఉండదని డీఎల్ ఆలోచిస్తున్నారు. ఈ మేరకు ఆయన సన్నిహితులతో సమావేశం కూడా నిర్వహించారు. అయితే కొద్దిరోజుల క్రితం డీఎల్ అధికార టీడీపీలో చేరేందుకే నిర్ణయించుకున్నారు. డీఎల్ చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చంద్రబాబు.. డీఎల్ చేరికకు మార్గం సుగమం చేసేందుకు మైదుకూరు నియోజకవర్గ ఇన్ ఛార్జిగా ఉన్న పుట్టా సుధాకర్ యాదవ్ కు టీటీడీ ఛైర్మన్ పదవి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. అందుకు పుట్టా కూడా అంగీకరించారు. కాని పుట్టా మాత్రం వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ తనకే కావాలని పట్టుబడుతున్నారు. నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తలతోనూ సమావేశమయ్యారు.
అయితే ఇది తెలిసిన డీఎస్ మనసు మార్చుకున్నట్లు తెలిసింది. పుట్టా సుధాకర్ యాదవ్ కు టీటీడీ ఛైర్మన్ పదవి ఇచ్చి పంపినా నియోజకవర్గంలో పుట్టా ఖచ్చితంగా చక్రం తిప్పుతారని డీఎల్ భావిస్తున్నారు. అందుకోసమే తాను టీడీపీలోకి రావాలంటే కొన్ని షరతులు పెట్టారు డీఎల్. తనను మైదుకూరు ఇన్ ఛార్జిగా నియమించాలన్నది మొదటి షరతు. తర్వాత తన నియోజకవర్గంలో ఎవరూ జోక్యం చేసుకోకూడదన్నది రెండో షరతు. ఈ షరతులకు అంగీకరిస్తే తాను టీడీపీలో చేరేందుకు సిద్ధమని డీఎల్ చెప్పారట. అయితే టీడీపీ అధిష్టానం నుండి ఎటువంటి సమాధానం రాలేదని సమాచారం. అంతే కాకుండా పుట్టా సుధాకర్ యాదవ్ మాత్రం టీటీడీ ఛైర్మన్ తీసుకుని నియోజకవర్గంలో మరింత బలపడాలని యోచిస్తున్నట్లు డీఎల్ కు తెలియడంతో ఆయన పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. డీఎల్ కు వైసీపీ నుంచి కూడా ఆఫర్ ఉంది. మైదుకూరు ప్రస్తుత ఎమ్మెల్యే రఘుమారెడ్డిని ప్రొద్దుటూరుకు పంపి డీఎల్ కు వైసీపీ అధిష్టానం మైదుకూరు టిక్కెట్ కేటాయిస్తామని వైసీపీ హామీ ఇచ్చిందని సమాచారం. దీంతో డైలమాలో పడ్డ డీఎల్ త్వరలోనే జగన్‌ని కలిసే యోచలలో ఉన్నారని.. అందుకోసం వైసీపీ ముఖ్య నేతలతో ఇప్పటికే చర్చించారని తెలుస్తోంది.