తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌కు ఆంధ్రాలో ఎంత క్రేజ్ ఉందో మనందరి తెలిసిన విషయమే . గతంలో తిరుమల
శ్రీవారి దర్శనానికి వెళ్లినప్పుడు గానీ ఇటీవలే పరిటాల అనంత్ శ్రీరామ్ వివాహ వేడుకకు హాజరైనప్పుడు గానీ అక్కడి ప్రజలు సీఎం కేసీఆర్ కు ఎలా నీరాజనాలు పట్టారో చూశాం. కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను అక్కడి అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కేక్‌లు కట్‌చేసి ఘనంగా జరుపుతున్న విషయం సైతం తెలిసిందే. సమస్యలపై సత్వర స్పందనలు, క్షేత్రస్థాయిలో అభివృద్ధి ఫలాలు అందజేయడం వంటి తదితర కార్యక్రమాలతో కేసీఆర్ తమ మనసులు గెలుచుకున్నారని ఆంధ్రా అభిమానులు పేర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా టీఆర్ఎస్ పార్టీని విస్తరించాలని ఎస్ఎంఎస్, ఈ-మెయిల్స్ ద్వారా వేలాదిగా అక్కడి ప్రజలు సీఎం కేసీఆర్‌ను ఇప్పటికే కోరారు. అక్కడి ప్రజాప్రతినిధులు సైతం సీఎం అభిమానుల జాబితాలో చేరారు. ఏపీ టీడీపీ నాయకులు తాజాగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ ప్రచారంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోటోను ఉపయోగిస్తూ నాయకులు ప్రచారం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం వెలమవారిపాలెంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌కు స్వాగతం పలుకుతూ సర్పంచ్ మామిళ్లపల్లి ప్రవీణ్‌కుమార్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఎన్టీఆర్, చంద్రబాబు ఫోటోలతో పాటు కేసీఆర్ ఫోటో కూడా పెట్టారు.
