తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షాలపై మంత్రి కేటీఆర్ జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాబోయే రెండు రోజులు వర్షాలు పడనున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కేటీఆర్ సూచించారు. సీసీటీవీలు, డయల్ 100, జీహెచ్‌ఎంసీ కాల్‌సెంటర్, మై జీహెచ్‌ఎంసీ యాప్ ద్వారా వస్తున్న ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీచేశారు. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను వెంటనే పునరుద్దరించాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ వాటర్‌వర్క్స్ అధికారులు చురుగ్గా సహాయక చర్యలు చేపడుతున్నారన్నారు. 140 మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు, 50 స్టాస్టిక్ బృందాలు నిరంతరం సహాయక చర్యలు చేపడుతున్నాయని..కాలువలు, నాలాలను క్లియర్ చేసేందుకు యత్నిస్తున్నాయని తెలిపారు. జీహెచ్‌ఎంసీలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం ద్వారా పరిస్థితులను ఎప్పటికపుడు పర్యవేక్షిస్తున్నామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.