ఏపీలో టీడీపీ కంచుకోట అయిన పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. 2014 ఎన్నికల్లో టీడీపీ పశ్చిమగోదావరి జిల్లాలో అన్ని నియోజకవర్గాలలో గెలిచి క్లీన్ స్వీప్ చేసింది. అయితే తాజాగా రాజకీయంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప.గో జిల్లాలోని ఏలూరు మండలం వెంకటాపురం గ్రామ పంచాయితి మాజీ సర్పంచ్ రెడ్డి అప్పలనాయుడిని టీడీపీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఓ నేత హత్యకు రెడ్డి అప్పలనాయుడు కుట్రపన్నారనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో టీడీపీ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుంది. ప.గో జిల్లా టీడీపీ అద్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ఆదేశాల మేరకు క్రమశిక్షణా చర్యల్లో భాగంగా రెడ్డి అప్పలనాయుడుని సస్పెండ్ చేయడంతో పాటు పార్టీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేశారు. దీంతో టీడీపీ అధిష్టానం రెడ్డి అప్పలనాయుడును సస్పెండ్ చేసినందుకు నిరసిస్తూ ఏలూరు మండలం వెంకటాపురం పంచాయతీ లోని 9 మంది వార్డు మెంబర్లు టీడీపీకి రాజీనామా చేశారు. మాజీ సర్పంచ్ రెడ్డి అప్పలనాయుడు పై సస్పెన్షన్ ఎత్తివేసి, ఆయనపై ఉన్న కేసులని కొట్టి వేయాలని వార్డు మెంబర్లు డిమాండ్ చేస్తున్నారు.
