తెలుగు రాష్ట్రాల్లో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన 175 సీట్లలోనూ పోటీ చేస్తుందని జనసేన అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుంచి ఒక పోస్టు వెలువడిన సంగతి తెలిసిందే. అయితే మరికాసేపటికే ఆ ట్వీట్ మాయమైంది. తాము పోటీచేసే అసెంబ్లీ నియోజక వర్గాల అంశంలో జనసేన ఇచ్చిన ఆ క్లారిఫికేషన్ తో రాజకీయ వర్గాలలో తప్పుడు సంకేతాలు వెళ్ళడంతో వెంటనే సదరు ట్వీట్ మటుమాయం అయ్యింది. దీంతో యధావిధిగా సోషల్ మీడియాకు పవన్ కళ్యాణ్ టార్గెట్ అయ్యాడు. ప్రస్తుతం చడిచప్పుడు లేకుండా సినిమాలు చేసుకుంటున్న పవన్ కళ్యాణ్, ఓ రాజకీయ వేదికపై అట్టహాసంగా ప్రకటించాల్సిన అంశాన్ని, ఓ సాధారణ ట్వీట్ మాదిరి చేయడం విస్మయానికి గురి చేసింది.
దీంతో పొలిటికల్ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున దీనిపై చర్చలు జరిగాయి. ట్వీట్ ను అయితే డిలిట్ చేయగలిగారు, సదరు ట్వీట్ ద్వారా చేసిన ప్రకటనకు పవన్ కళ్యాణ్ ఎప్పుడోకప్పుడు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇక జనసేన బలాన్ని తక్కువ చేస్తూ చూపేలా ఉన్న ట్వీట్ పై అభిమానుల నుంచి నిరసనలు రావడంతోనే ఆ ట్వీట్ ను తొలగించినట్టు సమాచారం. ఈ ఉదయం 9.57 గంటల సమయంలో జనసేన పార్టీ ట్విట్టర్ ఖాతాలో ఈ ట్వీట్ కనిపించగా, అది వైరల్ అయింది. ఆపై కాసేపటికే ఈ ట్వీట్ జనసేన పార్టీ ఖాతా నుంచి మాయం అయింది. ఇప్పుడా ట్వీట్ ప్రింట్ స్క్రీన్ ఇమేజ్ లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.