ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు జగన్ కంచుకోట అయిన కడప జిల్లాలో బలోపేతం అయ్యేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కడపలో టీడీపీ పటిష్టత కోసం చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అవి మాత్రం రివర్స్‌లో కొడుతున్నాయి. కడప జిల్లాకు చెందిన మంత్రి ఆదినారాయణరెడ్డిని వైసీపీ నుండి తీసుకువచ్చి మంత్రి పదవి కూడా ఇచ్చారు. అయినా పార్టీ కడప జిల్లాలో బలోపేతం అవుతుందని చంద్రబాబు భావించారు. తాజాగా మైదుకూరులో మాజీ మంత్రి డీఎల్.రవీంద్రారెడ్డిని సైతం బాబు పార్టీలో చేర్చుకునేందుకు వీలుగా అక్కడ టీడీపీ ఇన్‌చార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్‌కు టీటీడీ చైర్మన్ ఇచ్చారు.
అయితే తన ప్లాన్లుతో జగన్ కంచుకోట బద్దలవుతుందని బాబు భావిస్తే ఆయన ప్రయత్నాలు మాత్రం అక్కడ రివర్స్ అయ్యి టీడీపీకే పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. జమ్మలమడుగు నియోజకవర్గంలో ప్రస్తుత మంత్రి ఆదినారాయణ రెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డిల మధ్య విభేదాలు తొలగక పోగా మరింత ముదిరాయి. రామసుబ్బారెడ్డి ఎమ్మెల్సీ అయిన తర్వాత జమ్మలమడుగు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. మంత్రిగా ఉన్న ఆదినారాయణరెడ్డి నియోజకవర్గంలో తక్కువుగా కార్యకర్తలతో టచ్‌లో ఉంటున్నారు. దీంతో క్రమక్రమంగా నియోజకవర్గంలో తన అచరులతో పూర్తిగా టచ్‌లోకి వెళ్లిన రామసుబ్బారెడ్డి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ తనకే వస్తుందని చెపుతున్నారట. ఈ విషయం తెలిసిన ఆది అగ్గిమీద గుగ్గిలమవుతున్నారట.
ఇక మైదుకూరులో టీటీడీ ఛైర్మన్ పదవి తనకు ఇస్తారని వస్తున్న వార్తల పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్న సుధాకర్ యాదవ్ గత మూడు రోజులుగా మైదుకూరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. కార్యకర్తలతో భేటీ అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో మైదుకూరు టిక్కెట్ తనదేనని కార్యకర్తలతో చెబుతున్నారు. ఇక్కడ పుట్టాకు టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చి మాజీ మంత్రి డీఎల్‌కు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్సీ సీటు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే పుట్టా మాత్రం వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు కూడా తనదే అని చెప్పుకుంటున్నారు. దీంతో పార్టీలోకి టిక్కెట్ ఆశించి వచ్చేందుకు రెడీ అవుతోన్న డీఎల్ వర్గం మండిపడుతోంది. ఏదేమైనా కడప జిల్లాలో పార్టీ బలోపేతం కోసం చంద్రబాబు వేస్తోన్న ప్లాన్లు రివర్స్ అయ్యి ఆయనకే తలనొప్పిగా మారాయని సర్వత్రా చర్చించుకుంటున్నారు.