ప్రముఖ సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి తన చేతికి పని చెప్పారు. గతంలో శాండిల్స్ విప్పలేదని తన అసిస్టెంట్‌ను కొట్టి వార్తల్లోకెక్కిన బాలయ్య.. ఇటీవల జరిగిన నంద్యాల ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా టీడీపీ కార్యకర్తపై చెయ్యిచేసుకొని వార్తల్లో నిలిచారు. ఇప్పుడు తాజాగా హిందూపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్న బాలకృష్ణ అక్కడ ఓ కార్యకర్తపై చేయి చేసుకున్నారు. హిందూపురంలోని బోయపేటలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో బాలకృష్ణతో పాటు పెద్ద ఎత్తున అభిమానులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆయన ఓ ఇంట్లోకి వెళుతుండగా.. బాలయ్య కంటే ముందు ఓ కార్యకర్త వెళ్లడానికి ప్రయత్నించాడు. దీంతో బాలయ్య అసహనంతో ఆ కార్యకర్త చెంప చెళ్లుమనిపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను టీడీపీ కార్యకర్తలు ఆన్లైన్లో పెట్టారు. ఇలా వరుసగా బాలకృష్ణ దురుసు ప్రవర్తనతో ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని తెలుగు తమ్ముళ్ళు గుసగుసలాడుకుంటున్నారు.