హైదరాబాదును భారీ వర్షం ముంచెత్తింది. నిన్న సాయంత్రం 4:30 నిమిషాలకు ప్రారంభమైన వర్షం ఎడతెరిపిలేకుండా కురిసింది. చిన్నగా మొదలైన వాన తీవ్రరూపం దాల్చింది. గాలులుతో కూడిన వర్షం హైదరాబాదుకు విద్యుత్ సరఫరా లేకుండా చేసింది. సుమారు పది నుంచి పదమూడు సెంటీమీటర్లమేర కురిసిన వర్షం ధాటికి హైదరాబాదు స్థంభించింది. కురిసిన వర్షం ధాటికి సుమారు 40 ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నగర వ్యాప్తంగా రోడ్లపై నీరు చేరింది. నాలాలు పొంగిపొర్లాయి.
కొన్ని చెట్లు, విద్యుత్ స్థంభాలు కూలిపోయాయి. గత పదేళ్లలో అత్యధికంగా కురిసిన వర్షపాతం ఇదే కావడం విశేషం. ఇంత తీవ్రమైన వర్షాన్ని ఈమధ్య కాలంలో చూడలేదని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా విద్యాసంస్థలు, కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. ప్రైవేటు సంస్థలు కూడా సెలవు తీసుకోవాలని సూచించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సహాయకచర్యలు ప్రారంభించామని చెప్పారు. వర్షంతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని, అందువల్ల ప్రైవేటు సంస్థలు కూడా సెలవు ప్రకటించాలని సూచించారు.